బీరు బాటిళ్లతో ఫైటింగ్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
బంజారాహిల్స్: మద్యం సేవించిన యువకులు బీరు బాటిళ్లతో రోడ్డుపైనే యుద్ధాన్ని తలపించే రీతిలో ఘర్షణ పడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేసన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78లో నివసించే బిల్డర్ బి.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు రాజసింహారెడ్డి (18) లండన్‌లో చదువుతున్నాడు. వారం క్రితం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి తన స్నేహితులకు మాదాపూర్‌లోని ఓ పబ్‌లో విందు ఇచ్చారు. విందులో దాదాపు 37 మంది మద్యం సేవించారు.
ఆ సమయంలో వారి మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్ద ఘర్షణగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని పెట్రోల్ పంప్ పక్కన ఉన్న బరిస్తా వద్దకు చేరుకుని బీరు బాటిళ్లతో హోరాహోరీగా తలపడ్డారు. గాలిలోకి బీరు బాటిళ్లు విసురుతూ వీధిపోరాటానికి దిగారు. బీరు బాటిళ్లు ముక్కలుముక్కలుగా రోడ్డుపై పడి కొన్ని వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొనే సరికి వారంతా పరారయ్యారు. ఈ దాడిలో రాజసింహారెడ్డికి తీవ్ర గాయాలు కాగా అతడిని శ్రీనగర్‌కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీధి పోరాటానికి దిగిన వారిపై ఐపీసీ సెక్షన్ 427, 324, 506ల కింద కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.