
తలసానిని కలసిన ఫిలిం చాంబర్ సభ్యులు
సినీ, టీవీ వాహనాల ఓనర్ల అసోసియేషన్‌తో ఇబ్బందులపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్‌తో కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కోరారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు, సభ్యులు దిల్‌రాజు, కె.ఎల్. దామోదర ప్రసాద్, శివరామకృష్ణ, రవికిశోర్, ప్రసాద్ తదితరులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యలను వివరించారు.
తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్‌కు తమ ఫెడరేషన్‌లో గుర్తింపు లేదని, షూటింగ్‌లకు వచ్చే వాహనాలను అడ్డుకుంటూ అంతరాయం కలిగిస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ లొకేషన్లను ధ్వంసం చేశారని, వారి ఆగడాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయంపై తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మంగళవారం చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.