తొలి స్వదేశీ విద్యా పీఠం!
దేశంలోనే తొలిసారిగా ఆంగ్లేతర మాధ్యమంలో ఏర్పాటైన ఉస్మానియా యూనివర్సిటీ
- ఉర్దూ భాషలోనే బోధన.. ప్రపంచ భాషల నుంచి పుస్తకాల తర్జుమా
- తొలి స్వదేశీ విద్యాపీఠమంటూ ప్రశంసించిన రాజగోపాలాచారి
- మొదట 25 మంది అధ్యాపకులు.. 225 మంది విద్యార్థులు
- నాటి ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచిన గన్‌ఫౌండ్రీ ప్రాంతం
- అప్పట్లోనే ప్రపంచ ఖ్యాతి పొందిన ఉస్మానియా
- ఓయూ పట్టభద్రులకు విదేశీ విద్యాలయాల్లో నేరుగా ప్రవేశం
- 1920లో మెట్రిక్.. 1926లో బీఏ పరీక్షల నిర్వహణ
- ఉన్నత విద్యా వ్యాప్తికి బీజం వేసిన యూనివర్సిటీ
- స్వాతంత్య్రానంతరం ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలు
వివిధ భాషలు, మతాల ప్రజల సమ్మేళనం హైదరాబాద్ సంస్థానం. అలాంటి సంస్థానం స్థానిక భాషకు పట్టం కట్టింది. బ్రిటిషు వలస పాలకులు పాశ్చాత్య విజ్ఞానాన్ని ఆంగ్ల మాధ్యమంలో వ్యాప్తి చేసిన తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా ఉర్దూ మీడియంతో ఉస్మానియా యూనివర్సిటీని నెలకొల్పింది. ప్రపంచ భాషల్లోని సబ్జెక్టు పుస్తకాలను ఉర్దూలోకి అనువాదం చేయించి మరీ బోధన కొనసాగించింది. ఇదే సమయంలో అత్యుత్తమ విద్యకు ఉస్మానియా ప్రపంచ ఖ్యాతి పొందింది. స్వాతంత్య్రానంతరం ఆంగ్ల మాధ్యమంలో బోధనకు మారింది. ఈ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
(మహ్మద్ మంజూర్, చింతకింది గణేశ్)
నాలుగో నిజాం మీర్ మహబూబ్ అలీ పాలనా (1869–1911) కాలం అది. హైదరాబాద్ నగరంలో స్కూళ్లు, కాలేజీలకు పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. వివిధ ప్రదేశాలను సందర్శించి.. ఫతే మైదాన్ (ప్రస్తుత లాల్ బహదూర్ స్టేడియం) ప్రక్కన ఉన్న గన్‌ఫౌండ్రీ ప్రాంతంలోని విశాలమైన భూములను ఎంపిక చేశారు. 1872లో ఆలియా బాలుర హైస్కూల్, మహబూబీయా బాలికల హైస్కూల్ భవనాలు నిర్మించారు. వాటికి ఎదురుగా 1887లో నిజాం కాలేజీని నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలో విశ్వవిద్యాలయం లేకపోవడంతో నిజాం కాలేజీకి మద్రాస్ విశ్వవిద్యాలయంతో అనుబం«ధ గుర్తింపు ఉండేది. స్కూళ్లు, కాలేజీలు ఉండడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం ఇక్కడే భవనాలు అద్దెకు తీసుకుని యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. (1919–1939) మధ్య గన్‌ఫౌండ్రీ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందింది.
25 మంది అధ్యాపకులు..225 మంది విద్యార్థులు
1917 ఏప్రిల్ 26న విశ్వవిద్యాలయం ప్రకటన జరిగినప్పటి నుంచి 1919 డిసెంబర్ 28 వరకు.. గన్‌ఫౌండ్రీలోని మస్రత్ మహల్ (ప్రస్తుత ఎస్‌బీఐ భవనం)తో పాటు అబిడ్స్ వెళ్లే మార్గంలోని ఆరు భవనాల్లో వర్సిటీకి ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో ప్రముఖ విద్యావేత్త సర్ రాస్ మసూద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 25 మంది అధ్యాపకులను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ సంస్థానం నుంచి వెళ్లి విదేశాల్లో చదివిన వారితోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రొఫెసర్లూ ఉన్నారు. ఇక రాతపరీక్షలు నిర్వహించి ఆర్ట్స్ విభాగంలోని వివిధ సబ్జెక్టుల్లో 225 మంది విద్యార్థులçకు అడ్మిషన్లు ఇచ్చారు. అయితే తొలినాళ్లలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్కో సబ్జెక్టు తరగతుల కోసం వివిధ భవనాల్లోకి మారాల్సి వచ్చేది.
ఇంగ్లిషేతర భాషలో బోధన
బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో అప్పటి వరకు ఏర్పాటైన విశ్వ విద్యాలయాల్లో ఆంగ్లమే బోధనా భాషగా ఉండేది. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో పాఠశాలలు, కాలేజీలన్నీ ఉర్దూ భాషలో కొనసాగేవి. అయితే 19వ శతాబ్దం చివరలో మొదటి సాలార్‌జంగ్ చొరవతో ఇంగ్లిషు మీడియం విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. బ్రిటిష్ స్కూళ్ల మాదిరిగా మదర్సా–ఆలియా, మదర్సా–ఐజా పాఠశాలలను స్థాపించారు. తర్వాత నిజాం కాలేజీలోనూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టారు. అయితే సంస్థానంలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉర్దూ భాషలోనే చదువుతున్నారన్న ఉద్దేశంతో ఉర్దూ మీడియంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
పుస్తకాల కోసం ‘దారుల్ తర్జుమా’
ఉస్మానియాను ఉర్దూ మీడియంలో కొనసాగించాలని నిర్ణయించారుగానీ.. అప్పటికి బోధనా పుస్తకాలన్నీ ఆంగ్లం, పర్షియన్, అరబ్బీ తదితర భాషల్లో ఉన్నాయి. దీంతో ఆయా సబ్జెక్టుల పుస్తకాలను ఉర్దూలోకి అనువాదం చేయడానికి 1917 సెప్టెంబర్ 6న అప్పటి విద్యావేత్త అబ్దుల్‌హక్ నేతృత్వంలో దారుల్ తర్జుమా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉర్దూ, ఆంగ్లం, పర్షియన్ భాషలపై పట్టున్న అనువాదకులను దేశ విదేశాల నుంచి రప్పించారు.
1920లో మెట్రిక్..1926లో బీఏ పరీక్షలు..
1919 డిసెంబర్ 28న ఉస్మానియా వర్సిటీ భవనం ప్రారంభమైనా.. విద్యా సంవత్సరం (1919–20) జూన్ నెల నుంచే మొదలైంది. ఆ విద్యా సంవత్సరం చివర్లో ఉస్మానియా వర్సిటీ ద్వారానే తొలి మెట్రిక్ (పదకొండో తరగతి, హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్) పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీ చేశారు. 1968–69 వరకు ఇదే విధానం కొనసాగింది. 1969 విద్యా సంవత్సరం నుంచి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి, సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) ఇస్తున్నారు. ఇక వర్సిటీ ఆధ్వర్యంలో 1926లో తొలిసారిగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) పరీక్షలు నిర్వహించారు.
తొలి స్వదేశీ విద్యాపీఠమంటూ కితాబు
1944లో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో దేశ, విదేశ విద్యాలయాల కులపతులు, ఉపకులపతులు, విద్యావేత్తలు, వివిధ సబ్జెక్టుల్లో పరిశోధనలు చేస్తున్న వారు పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమకారుడు, న్యాయవాది అయిన రాజగోపాలాచారి కూడా హాజరై ప్రసంగించారు. దేశంలో మైసూర్, మద్రాస్ వర్సిటీల్లో ఆంగ్లభాషలో బోధన జరుగుతోందని.. ఉస్మానియాలో మాత్రం దేశీ భాష అయిన ఉర్దూలో బోధన జరగడం గర్వకారణమని, ఉస్మానియా తొలి స్వదేశీ విద్యాపీఠమని కితాబిచ్చారు.
విదేశీ వర్సిటీల్లో నేరుగా ప్రవేశం
ఉస్మానియా విద్యా ప్రమాణాలకు అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులు మరిన్ని డిగ్రీలు, పైచదువుల కోసం ఇతర దేశాల్లోని యూనివర్సిటీలకు వెళితే.. ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా నేరుగా అడ్మిషన్ ఇచ్చేవారు. దేశంలోని ఇతర వర్సిటీల్లో చదివిన వారికి ఈ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఉన్నత విద్యా వ్యాప్తికి ఉస్మానియా వర్సిటీ ఇతోధికంగా కృషి చేసింది. 1920–30 దశకాల్లో సిటీ కాలేజీ, నాంపల్లి బాలికల కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ, వరంగల్ ఇంటర్మీడియట్ కాలేజీలను స్థాపించింది. 1948లో నిజాం పాలన ముగిసేనాటికి ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో 11 ఆర్ట్స్ సైన్స్ కాలేజీలు, 7 వృత్తి విద్యా కాలేజీలు కలిపి మొత్తంగా 18 కాలేజీల్లో 6,239 మంది ఉన్నత విద్యను అభ్యసించారు.
ఉర్దూ నుంచి మళ్లీ ఆంగ్లానికి..
హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమయ్యాక కూడా ఉస్మానియాలో ఉర్దూ మీడియంలో విద్యా బోధన కొనసాగింది. 1950లో అప్పటి ప్రధాని నెహ్రూ, కేంద్ర విద్యామంత్రి మౌలానా ఆజాద్ అధికార పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. అప్పటి రాష్ట్ర పాలకులు, ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్‌తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ప్రధాని నెహ్రూ, మౌలానా ఆజాద్‌లకు నిజాం ఉస్మాన్ అలీఖాన్ కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఉస్మానియాను తాను ఎన్నో డబ్బులు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశానని, దానిని అదే పద్ధతిలో కొనసాగించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన నెహ్రూ, ఆజాద్‌లు.. ఉస్మానియాలో ఉర్దూకు బదులు ఆంగ్ల భాషలో బోధనలు జరగాలని నిర్ణయించారు. దేశంలోని వర్సిటీలన్నీ ఆంగ్లంలో బోధిస్తున్నందున.. పరస్పరం సహకారానికి అనువుగా ఉంటుందన్నారు. అలా ఉస్మానియా లో 1950 నుంచి ఆంగ్లంలో బోధన మొదలైంది.
ఉన్నత విద్యాశిఖరం
‘‘గత వందేళ్లలో కోటి మందికిపైగా విద్యార్థులకు ఉస్మానియా వర్సిటీ విద్యను అందించింది. ఆధునిక యుగంలో ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగ తికి వర్సిటీ తోడ్పడింది. ఉర్దూ మీడియంలో బోధన జరిగినా ఆంగ్ల భాషనూ బోధించారు. దక్కన్ మిశ్రమ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, ఆధునికతను పెంపొందించడంలో ఉస్మానియా పాత్ర మరువలేనిది..’’
– ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్