గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం బుధవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి భారీ ఊరేగింపు సైతం ఉంటుంది.
సాక్షి, సిటీబ్యూరో : గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం బుధవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. బుధవారం ఉదయం నుంచి ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది.
నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఊరేగింపు మధ్య నుంచి ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతించరు. అవసరమైతే ఈ సమయాన్ని పొడిగిస్తారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ప్రధాన ఊరేగింపు మార్గం
కేశవగిరి-నాగుల్‌చింత-ఫలక్‌నుమ-చార్మినార్-మదీనా-అఫ్జల్‌గంజ్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది.
సికింద్రాబాద్ వైపు నుంచి...
ఆర్పీ రోడ్-ఎంజీ రోడ్-కర్బాలామైదాన్-ముషీరాబాద్ చౌరస్తా-ఆర్టీసీ క్రాస్‌రోడ్స్- నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్-హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది.
ఈస్ట్‌జోన్ నుంచి...
ఉప్పల్-రామాంతపూర్-అంబర్‌పేట్-ఓయూ ఎన్‌సీసీ-డీడీ హాస్పిటల్ మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతో కలుస్తుంది.
వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి.
నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం.
వెస్ట్-ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది.
వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
సందర్శకుల పార్కింగ్ స్థలాలివీ..
ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి.
నిమజ్జనం తరవాత విగ్రహాలను తెచ్చిన లారీలు/ట్రక్కులు తిరిగి వెళ్లేందుకు రూట్లు కేటాయించారు.
ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్‌రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు.
అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్‌పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడీగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్‌హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అనుమతించరు.
ఇంటర్ డిస్ట్రిక్ట్ /స్టేట్ లారీలకు..
ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లను వినియోగించుకొని వెళ్లాల్సి ఉంటుంది.
హెల్ప్‌లైన్స్ ఏర్పాటు
ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం హెల్ప్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 27852482, 27852486, 90102 03626 నంబర్లలో సంప్రదించవచ్చు.