ఫోర్జరీతో మోసం
కమర్షియల్ ట్యాక్స్ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
రాంగోపాల్‌పేట్: హోటల్ నిర్వహణకు భవనాన్ని అద్దెకు తీసుకున్న నిర్వాహకుడి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులను మోసం చేసిన ఓ వ్యక్తిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ తేజంరెడ్డి తెలిపిన మేరకు.. యాకుత్‌పురకు చెందిన రహీముద్దీన్ (50) నగరంలోని వనస్థలిపురం, నాగోల్, లక్డీకపూల్, ఎల్‌బీనగర్ ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో గ్రీన్ బావర్చీ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం వద్ద 2014లో ప్రదీప్ సింగ్ అనే వ్యక్తికి చెందిన భవనాన్ని నెలకు రూ.1.95 లక్షల చొప్పున అద్దెకు తీసుకుని హోటల్ ప్రారంభించారు. 2015 ఫిబ్రవరి నెల వరకు అద్దెను సక్రమంగా చెల్లించిన రహీముద్దీన్ మే నెలలో మెట్రో పనుల్లో భాగంగా కొంత భవనం రోడ్డు విస్తరణలో పోవడంతో మరమ్మతులు ప్రారంభించారు.
అటు తర్వాత అద్దెను చెల్లించకుండా నిలిపివేయడంతో పాటు నెలకు కేవలం రూ.4వేల మాత్రమే అద్దె చెల్లిస్తున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశాడు. ఈ డాక్యుమెంట్లను కమర్షియల్ టాక్స్ అధికారులకు అందించారు. ఇలా ఒకవైపు కమర్షియల్ ట్యాక్సు అధికారులను మోసం చేయడంతో పాటు భవన యజమానికి అద్దెను చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తన సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తెలుసుకున్న భవన యజమాని ప్రదీప్ సింగ్ ఫిబ్రవరి 11న మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితున్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.