
ఎస్‌సీసీఎల్‌లో ఉద్యోగాలంటూ టోకరా
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)లో ఉద్యోగాల పేరుతో దరఖాస్తుదారులకు వల వేసి నిలువునా ముంచిన ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు
♦ ఆ సంస్థలో ఉన్నత ఉద్యోగే ప్రధాన సూత్రధారి
♦ డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్‌లతో కలసి కుట్ర
♦ గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)లో ఉద్యోగాల పేరుతో దరఖాస్తుదారులకు వల వేసి నిలువునా ముం చిన ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నామని, పరారీలో ఉన్న మరో ముగ్గురు దళారుల కోసం గాలిస్తున్నామని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు. ఈ గ్యాంగ్ గతంలో ‘‘అన్-ఫిట్’’ స్కామ్‌కు పాల్పడినట్లు సమాచారం ఉందని తెలిపారు.
పరీక్ష వాయిదానే ఆసరాగా...
ఆదిలాబాద్ జిల్లా ఆర్కే-8 కాలనీకి చెందిన కె.కిరణ్‌కుమార్ ఎస్‌సీసీఎల్‌లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ గత ఏడాది 56 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు గత నెల 20న జరగాల్సిన రాతపరీక్ష వాయిదా పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కిరణ్‌కుమార్ తన డ్రైవర్ ఎం.రమేశ్, కంప్యూటర్ ఆపరేటర్ ఎస్.రమేశ్‌లతో కలసి దరఖాస్తుదారుల్ని మోసం చేయడానికి కుట్ర పన్నాడు. గతంలో ఇదే సంస్థలో పనిచేసి మానేసిన మన్‌మోహన్, రషీద్, కొమరయ్యల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. హాల్‌టికెట్లు పొందిన వారిలో దాదాపు 60 మందిని దళారుల ద్వారా సంప్రదించి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎరవేశారు.
నకిలీ టెస్ట్‌పేపర్లు సైతం తయారీ...
అలా వచ్చిన వారికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ చెప్పి రూ.10 వేల నుంచి రూ.20 వేలు అడ్వాన్సుగా తీసుకుందీ గ్యాంగ్. ఉద్యోగం వచ్చిన తరవాత రూ.10 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్ నేతృత్వంలోని బృందం వల పన్ని కిరణ్, ఎం.రమేశ్, ఎస్.రమేశ్‌లను అరెస్టు చేసి రూ.2 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, నకిలీ బిట్‌బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించిన అధికారులు పరారీలో ఉన్న ఏజెంట్ల కోసం గాలిస్తున్నారు.
వైద్యులతో కలసి మరో స్కామ్
నిందితుల విచారణ నేపథ్యంలో ఈ గ్యాంగ్ గతంలో మరో స్కామ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఎస్‌సీసీఎల్‌లో ఉద్యోగులు అన్-ఫిట్‌గా మారితే వారి వారసులకు ఉద్యోగం ఇచ్చేవారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కిరణ్ ముఠా పలువురు ఎస్‌సీసీఎల్ ఉద్యోగుల నుంచి డబ్బు దండుకుని, కొందరు వైద్యుల సహాయంతో ‘అన్-ఫిట్’ సర్టిఫికెట్లు జారీ చేయించేదని తేలింది.