ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వినాయకచవితి, బక్రీద్ వరుస పండుగల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం లో సోమవారం డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు, లౌడ్‌స్పీకర్ల నిర్వహణ, నిమజ్జనం తదితర విషయాలపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
సున్నితమైన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, అవసరమైతే మత పెద్దలను సమావేశపరిచి వారి సహకారం తీసుకోవాలన్నారు. ఇటీవల ముగిసిన కృష్ణా పుష్కరాల భద్రతపై అనురాగ్‌శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులకు ఆటంకాలు కలగకుండా పోలీసులు తీసుకున్న చర్యలు అత్యద్భుతమని కితాబిచ్చారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరీ, ప్రకాశ్‌రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనర్లు మహేశ్ భగవత్, నవీన్‌చంద్, శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, డీఐజీలు అకున్‌సబర్వాల్, కల్పననాయక్ పాల్గొన్నారు.