అబిడ్స్/సుల్తాన్‌బజార్/కలెక్టరేట్/దత్తాత్రేయనగర్, న్యూస్‌లైన్: గణేశ్ నిమజ్జనోత్సవం లక్షలాది భక్తుల మధ్య కోలాహలంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన నిమజ్జన యాత్రకు అశేష భక్తజనవాహిని తరలివచ్చింది. చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, సైదాబాద్, చంపాపేట్, చార్మినార్, కాచిగూడ, కోఠి, ధూల్‌పేట్, జియాగూడ, కార్వాన్, గోషామహాల్, బేగంబజార్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గణేష విగ్రహాలతో మొజంజాహీ మార్కెట్ జనసంద్రంగా మారింది.
పలు అసోసియేషన్ల నిర్వాహకులు వివిధ వాహనాలపై వినూత్నంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు భక్తులు వాహనాలపై భారీ జాతీయ పతాకాలను, కాషాయ జెండాలను చేబూని యాత్రలో పాల్గొన్నారు. ముచ్చటగొలిపే వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను భక్తులు దర్శించి తరించారు. జైగణేష్ మహరాజ్‌కీ జై... గణపతి బప్పా మోరియా...అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఊరేగింపు ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వాగత వేదికల నుంచి పలువురు ప్రముఖులు చేసిన ప్రసంగాలు ఊరేగింపులో పాల్గొన్న జనాల్లో ఉత్సాహాన్ని నింపాయి. ట్యాంక్‌బండ్‌కు తరలివెళ్లే భక్తులకు నిర్వాహకులు ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు.
మధ్యాహ్నం నుంచి పెరిగిన జోరు
ఉదయం నుంచే ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం మధ్యాహ్నంతో మరింత జోరందుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలతో మొజంజాహీ మార్కెట్ నుంచి ఘన స్వాగతాల మద్య వినాయకసాగర్‌కు తరలివెళ్లాయి. బ్యాండ్ మేళాల హోరులో భక్తులు మైమరిచి నృత్యాలు చేస్తూ గణనాథుడి శోభాయాత్రలో పాల్గొన్నారు. కాగా, సామూహిక నిమజ్జనానికి తరలివచ్చిన అశేషజనవాహినిలో పలువురు చిన్నారులు తప్పిపోయారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్వాగత వేదికల నుంచి తమ చిన్నారుల కోసం విజ్ఞప్తి చేశారు.
వర్షంలోనూ సాగిన యాత్ర
వినాయక నిమజ్జన శోభాయాత్ర జోరు వర్షంలో సైతం కొనసాగింది. సాయంత్రం ప్రారంభమైన వర్షంలో భక్తులు తడుస్తూ రెట్టింపు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సైతం తమదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. ప్రజలు వర్షం కారణంగా కొంత ఇబ్బంది పడినా వివిధ వినాయక ప్రతిమలను తిలకించేందుకు ఆసక్తి కనబరిచారు.
పోలీసుల అత్యుత్సాహం
బేగంబజార్, సిద్ధిఅంబర్‌బజార్, ఉస్మాన్‌గంజ్ ప్రాంతాలలో మైక్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై భక్తులు మండిపడ్డారు. ప్రసాదాలు పంపిణీ చేసే వద్ద ఉంచిన బాక్స్‌లనూ పోలీసులు సీజ్ చేశారు.
జనసంద్రంగా ఎంజే మార్కెట్
Published Thu, Sep 19 2013 3:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement