
సిమ్‌కార్డుల గుట్టు తేలేనా?
* నయీమ్ డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న 700 సిమ్‌కార్డులపై దర్యాప్తు షురూ
* టెలికం కంపెనీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసు దర్యాప్తు వేగం అందుకుంది. ఇన్నాళ్లు భూ డాక్యుమెంట్లు, ఇళ్లపై దృష్టిపెట్టిన పోలీసులు ఇప్పుడు సాంకేతిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. పుప్పాలగూడ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితో పాటు వంట మనిషి ఫర్హా నా పేరిట తిరుమల గార్డెన్‌లో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్, అంజలీ గార్డెన్‌లో ఉన్న మరో ఇంటి నుంచి లభించిన మొత్తం 700 సిమ్‌కార్డులపై విచారణను వేగవంతం చేశారు. ఆయా నెట్‌వర్క్‌ల సిమ్‌కార్డులతో ప్రత్యేక పోలీసు బృందం ఆయా కంపెనీలకు వెళ్లింది. ఆ సిమ్‌కార్డులన్నీ ఎవరి పేరిట ఇచ్చారు? చిరునామాలేంటి? అన్న వివరాలతోపాటు కాల్ డేటా జాబితాను సేకరిస్తున్నారు.
తప్పుడు చిరునామాలతో.. : చాలా సిమ్‌కార్డులను తప్పుడు చిరునామాలతో తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కొన్ని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవారి ఆధార్ కార్డులు సమర్పించినట్టు గుర్తించారు. సిమ్‌కార్డులపై పూర్తిస్థాయి దర్యాప్తుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. అలాగే కొన్ని కాల్‌డేటా వివరాలను డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ చేస్తున్నారు.
వారిద్దరికీ మరో ఆరు రోజుల కస్టడీ..
అల్కాపురి కాలనీలోని నయీమ్ ఇంట్లో పట్టుబడ్డ ఫర్హానా, అఫ్సాలను 12 రోజుల పోలీసు కస్టడీ ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి న్యాయస్థానం మంగళవారం విచారించింది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని, మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వాదించారు. అయితే న్యాయమూర్తి 6 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు బుధవారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి వారిద్దరిని కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిని రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలోని నయీం ఆస్తులను గుర్తించేందుకు తీసుకువెళ్లనున్నారు.
సమీరుద్దీన్ కస్టడీకి పిటిషన్
పోలీసులు సోమవారం అరెస్టు చేసిన నయీమ్ డ్రైవర్ సమీరుద్దీన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హయత్‌నగర్ న్యాయస్థానంలో మంగళవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. నల్లగొండకు చెందిన మహ్మద్ రియాజుద్దీన్ కుమారుడు మహ్మద్ సమీరుద్దీన్ ఏడాది క్రితం నుంచే నయీమ్, అతని అల్లుడైన ఫహీంల వద్ద పని చేసేవాడు. సమీరుద్దీన్‌ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.