‘గ్యాస్’ దోపిడీ | 'Gas' exploitation | Sakshi
Sakshi News home page

‘గ్యాస్’ దోపిడీ

Published Thu, Nov 14 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

'Gas' exploitation

తూకంలో చేతివాటం
 = ఆయిల్ కంపెనీల మాయాజాలం
 = బాట్లింగ్ యూనిట్లలోనే మోసపు తంతు
  =తక్కువ గ్యాస్ నింపి  వినియోగదారులకు పంపిణీ
 = నెలకు రూ.18 కోట్ల  మేరకు టోకరా

 
సాక్షి, సిటీబ్యూరో: విజయనగర్‌కాలనీకి చెందిన గృహిణి అనురాధ ఆన్‌లైన్‌లో సిలిండర్ బుక్ చేసిన వారానికి గ్యాస్‌బండ వచ్చింది. ముగ్గురు సభ్యుల కుటుంబం.. కానీ 20 రోజులకే గ్యాస్ నిండుకొంది. మరో సిలిండర్ బుక్ చేస్తే, అదీ వచ్చిన 17 రోజులకే ఖాళీ అయింది. మూడోసారి అనుమానం వచ్చి సిలిండర్ ఇంటికి రాగానే తూకం వేశారు. ఉండాల్సిన బరువులో 1.30 కిలోల వరకు తక్కువున్నట్టు తేలింది.

అనురాధే కాదు.. మహానగరంలో లక్షలాది మంది ఎల్పీజీ వినియోగదారులు నిత్యం ఇలాగే మోసపోతున్నారు. మహానగరంలో వంటగ్యాస్ వినియోగదారులు నిట్టనిలువునా దోపిడీకి గురవుతున్నారు. నగదు బదిలీ పథకం పుణ్యమా అని ఇప్పటికే గ్యాస్‌బండ ధర చుక్కలు చూపిస్తోంది. ఇక, సిలిండర్‌లో సైతం తక్కువ గ్యాస్ నింపడం తాజా షాక్. సిలిండర్‌లో నిర్ధేశిత బరువు కంటే తక్కువ పరిమాణంలో లిక్విడ్ పెట్రోలి యం గ్యాస్ (ఎల్పీజీ) నింపుతూ సరఫరా చేయడం సర్వసాధారణమైంది.

ప్రతి గృహవినియోగ సిలిండర్‌లో కిలో నుంచి రెండు కిలోల వరకు, కమర్షియల్ సిలిండర్‌లో 2-3 కిలోల వరకు తక్కువ గ్యాస్ నింపుతూ పంపిణీ చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ల నుంచే ఇలా తక్కువ తూకంతో రీఫిల్లింగ్ జరుగుతున్నట్లు ఇటీవల తూని కల కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసింది.
 
 తక్కువ తూకం వుంటే..

 గ్యాస్ ఏజెన్సీ.. ఎల్పీజీ సిలిండర్‌ను బరువు తూచే యంత్రం ద్వారా తూకం వేసి వినియోగదారులకు అందించాలి. వినియోగదారుడు కూడా సిలిండర్‌ను తూకం వేసి తీసుకోవాలి. గృహవినియోగ సిలిండర్ మొత్తం బరువు సుమారు 29.9 కిలోలు ఉంటుంది. అందులో 15.7 కేజీలు సిలిండర్, 14.2 కేజీల వరకు గ్యాస్ బరువు ఉండాలి. సిలిండర్‌ను వేయింగ్ మెషీన్‌పై తూకం వేస్తే మొత్తం బరువు 29.9 కేజీల వరకు ఉండాలి. దీనికంటే తక్కువుంటే మాత్రం తూకంలో మోసం జరిగినట్లు భావించాలి. తక్షణం తూనికల కొలతల శాఖకు ఫిర్యాదు చేయాలి. వాణిజ్య అవసరాల సిలిండర్ పరిమాణం 19 కేజీల మేర ఉండాలి.
 
 గ్రేటర్‌లో 63 కేసులు నమోదు
 
 గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తూనికల కొలతల శాఖాధికారులు ఇటీవల 63 వరకు కేసులు నమోదు చేశారు. గృహవినియోగ సిలిండర్‌లో 585 గ్రాముల నుంచి 1.09 కిలోల వరకు, కమర్షియల్ సిలిండర్‌లో 1.6 కిలోల నుంచి 2.9 కిలోల వరకు తక్కువగా రీఫిల్లింగ్ చేసి మోసం చేస్తున్న కారణంగా ప్రధాన మూడు ఆయిల్ కంపెనీలతో పాటు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లపై కేసులు నమోదు చేశారు. ఇటీవల చర్లపల్లిలోని ఐవోసీ ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్‌లో తూనికల కొలతల శాఖాధికారులు తనిఖీలు చేసి ఒక డొమెస్టిక్ సిలిండర్ బరువును పరిశీలించారు. నిర్ధేశిత బరువు కంటే తక్కువ తూగింది. దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేశారు. ఇలా మూడు కంపెనీలపైనా కేసులు నమోదయ్యాయి.
 
 తేడాలుంటే ఫిర్యాదు చేయండి
 ఎల్పీజీ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌ను తూకం వేశాకే తీసుకోవాలి. సిలిండర్ బరువును తీసేసి గ్యాస్ బరువును లెక్కించాలి. తక్కువగా ఉంటే తిరస్కరించాలి.
 - పీఆర్‌ఎన్‌టీ స్వామీ, ప్రాంతీయ ఉప కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ, హైదరాబాద్
 
 గ్యాస్ దోపీడీ నెలకు రూ.18 కోట్ల పైమాటే..
     
 గ్రేటర్‌లో మొత్తం ఎల్పీజీ గృహవినియోగ కనెక్షన్లు: 26 లక్షలు
     
 నిత్యం ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీల రీఫిల్లింగ్ సిలిండర్ల సరఫరా: 80 వేలు
     
 గృహావసరాల సిలిండర్ పరిమాణం:14.2 కేజీలు
     
 మార్కెట్ ధర ప్రకారం కిలో గ్యాస్ విలువ:రూ.75
     
 గృహవినియోగ సిలిండర్ల తూకంలో సగటున తక్కువ ఉంటున్న పరిమాణం: 1- 2 కేజీలు
     
 80 వేల సిలిండర్లపై రోజుకు వినియోగదారులు నష్టపోతున్న గ్యాస్ విలువ:
 రూ.60 లక్షలు
     
 ఆయిల్ కంపెనీలు నెలకు వేస్తున్న టోకరా విలువ: రూ.18 కోట్లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement