
సొంతగూటికి చేరుతున్న నాయకులు: గట్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు ఒక్కొక్కరుగా తిరిగి వైఎస్సార్‌సీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు ఒక్కొక్కరుగా తిరిగి వైఎస్సార్‌సీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
శ్రీకాంత్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదని అన్నారు. ప్రజాసమస్యలే ఎజెండాగా పని చేసే ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తున్న పార్టీ వైఎస్సార్‌సీపీ అని చెప్పారు. 2019 నాటికి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు తమ పార్టీ గట్టి పోటీని ఇస్తుందని శ్రీకాంత్ తెలిపారు.
ధర్నా చౌక్ ఆందోళనకు మద్దతు
వివిధ రాజకీయ పక్షాలు ధర్నా చౌక్ ఎత్తివేతను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ విషయంలో అన్ని రాజకీయపార్టీలు, ప్రజాతంత్ర ప్రజాసంఘాలు నిరంతరాయంగా చేస్తున్న ఆందోళనలో తమ పార్టీ నగర శ్రేణులు కూడా భాగస్వాములవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్.భాస్కర్‌రెడ్డి, బి.రవీందర్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు.