హైదరాబాద్ : కేసీఆర్ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు నిప్పులు చెరిగారు. జిల్లాల పునర్ విభజనపై శనివారం హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించలేదు.
దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ సీపీ నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండ రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు ట్యాంక్బండ సమీపంలోని బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేసీఆర్ పాలన బూటకమని ఆరోపించారు. రాజకీయ దురద్దేశంతోనే కేసీఆర్ జిల్లాలను పునర్ విభజన చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల పునర్ విభజన అంశం కోర్టుల్లో నిలబడదన్నారు.
తమ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని సిగ్గుమాలిన చర్యలకు పాల్పడ్డారంటూ కేసీఆర్పై పార్ట నేతలు మండిపడ్డారు. మీకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ నేతలకు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండ రాఘవరెడ్డి, శివకుమార్ సవాల్ విసిరారు.