T YSRCP Leader
-
'కేసీఆర్ పాలన బూటకం'
హైదరాబాద్ : కేసీఆర్ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు నిప్పులు చెరిగారు. జిల్లాల పునర్ విభజనపై శనివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించలేదు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ సీపీ నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండ రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు ట్యాంక్‌బండ సమీపంలోని బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేసీఆర్ పాలన బూటకమని ఆరోపించారు. రాజకీయ దురద్దేశంతోనే కేసీఆర్ జిల్లాలను పునర్ విభజన చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల పునర్ విభజన అంశం కోర్టుల్లో నిలబడదన్నారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని సిగ్గుమాలిన చర్యలకు పాల్పడ్డారంటూ కేసీఆర్‌పై పార్ట నేతలు మండిపడ్డారు. మీకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ నేతలకు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండ రాఘవరెడ్డి, శివకుమార్ సవాల్ విసిరారు. -
బంగారు తెలంగాణ అంటే చార్జీలు పెంచడమా?
హైదరాబాద్ : రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీవైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ... బంగారు తెలంగాణ అంటే ఛార్జీలు పెంచడమా...? అని ఆయన ప్రశ్నించారు. రెండేళ్ల సంబరాలంటూ ప్రచారానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలపై చిల్లిగవ్వ కూడా భారం వేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెంచిన ఛార్జీలకు నిరసనగా శనివారం ఉదయం 10.00 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ధర్నా నిర్వహించనున్నట్లు కొండా రాఘవరెడ్డి చెప్పారు. -
'కేసీఆర్ దుందుడుకు చర్యలు మానుకోవాలి'
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యార్థిని ప్రాణం తీసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి స్పందించాలన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుందుడుకు చర్యలు ఆపి ఆచరణ సాధ్యమయ్యే హామీలు చేసేందుకు దృష్టి సారించాలని సూచించారు. హైకోర్టు నుంచి నోటీసులు రాకముందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేసీఆర్‌కు కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. లేకుంటే వారిని బర్త్‌రఫ్ చేయాలన్నారు. దీనిపై కేసీఆర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.