హైదరాబాద్ : రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీవైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ... బంగారు తెలంగాణ అంటే ఛార్జీలు పెంచడమా...? అని ఆయన ప్రశ్నించారు.
రెండేళ్ల సంబరాలంటూ ప్రచారానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలపై చిల్లిగవ్వ కూడా భారం వేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెంచిన ఛార్జీలకు నిరసనగా శనివారం ఉదయం 10.00 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ధర్నా నిర్వహించనున్నట్లు కొండా రాఘవరెడ్డి చెప్పారు.