60 కోట్లతో సీఎం భవనాలు నిర్మించుకుంటే చాలా?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ 60 కోట్లతో ప్రగతి భవన్ కట్టించుకున్నాడు. కానీ, రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం తన కోసం భారీ వ్యయంతో భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.
కేసీఆర్ సర్కార్ మొదటి కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమైయ్యాయని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కేసీఆర్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల రైతాంగం అప్పుల ఊబిలో ఉన్నట్లు జాతీయ సర‍్వేలో వెల్లడైందని చెప్పారు. బ్యాంకులు రుణాలిచ్చి రైతులను ఆదుకోవాలని రాఘవరెడ్డి కోరారు.