జీహెచ్‌ఎంసీకి మతిమరుపు’... ఈ విషయం అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ‘గ్రేటర్’ కమిషనర్ సోమేశ్‌కుమారే.
- జీహెచ్‌ఎంసీకి మతిమరుపు
- చమత్కరించిన కమిషనర్
- ఖాళీ ప్రదేశాల రక్షణకు ‘గ్రేటర్’ చర్యలు
- ఇప్పటికి 385 స్థలాల గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: ‘జీహెచ్‌ఎంసీకి మతిమరుపు’... ఈ విషయం అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ‘గ్రేటర్’ కమిషనర్ సోమేశ్‌కుమారే. నగరంలో అధిక డిమాండ్ ఉన్న భూములను ఇప్పటివరకూ గాలికొదిలేసిన జీహెచ్‌ఎంసీ.. అవి కబ్జాల పాలవుతుండటంతో వాటిని కాపాడుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఈ విషయాన్ని చెబుతూ జీహెచ్‌ఎంసీకి ఎన్ని ఖాళీ స్థలాలున్నాయో లెక్కలేదని అన్నారు.
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీకి మతిమరుపు అని చమత్కరించారు. సర్కిళ్ల వారీగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ భూముల్ని గుర్తించే చర్యలు చేపట్టామని తెలిపారు. గత నెలాఖరు వరకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేని 320 జీహెచ్‌ఎంసీ భూముల్ని గుర్తించామని.. ప్రస్తుతం వీటి సంఖ్య 385కి చేరిందని వివరించారు. ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదని.. గుర్తించిన ఈ 385 బహిరంగ ప్రదేశాలకు రూ. 49 కోట్లతో 70 కి.మీ.ల మేర ప్రహరీలు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే ప్రహరీలున్న వెయ్యి బహిరంగ ప్రదేశాలతోపాటు ఈ 385 ప్రదేశాల్లోనూ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. వేసవి ముగిసేలోగా వీటన్నింటికీ ప్రహరీలు నిర్మించి, వచ్చే వర్షాకాలంలోగా మొక్కలు నాటే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఖాళీ ప్రదేశాలు కనిపిస్తే ప్రజలు వాటిని జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు తెలియజేయాల్సిందిగా సూచించారు.
గత నెలాఖరు వరకు గుర్తించిన ఖాళీస్థలాలు (సర్కిళ్ల వారీగా)..
కాప్రా- 27, ఉప్పల్- 13, ఎల్‌బీనగర్-18, చార్మినార్-6, సర్కిల్ 5 - 3, రాజేంద్రనగర్-45, సర్కిల్ 7- 2, సర్కిల్8- లేవు, సర్కిల్9- 6, సర్కిల్ 10-31, సర్కిల్ 11- 15, సర్కిల్ 12-20, సర్కిల్ 13-7, కూకట్‌పల్లి-27, కుత్బుల్లాపూర్-22 అల్వాల్-45, మల్కాజిగిరి-27, సికింద్రాబాద్-6. వెరసి మొత్తం 320. అన్ని సర్కిళ్లలో మరో 65 పెరగడతో ఇప్పుడవి 385కు చేరాయి.