
ఫిబ్రవరిలో ముహూర్తం?
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం
♦ అధికారుల కసరత్తు
♦ అభిప్రాయ సేకరణకు సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. 2016 ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15లోగా ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. విభజనలో జాప్యంతో ఈ గడువులో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పునర్విభజనలో భాగంగా డివిజన్ల సంఖ్యలో మార్పులు చోటు చేసుకోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ కోసం త్వరితంగా పనులు పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. విభజన, వార్డు రిజర్వేషన్లు ఖరారు చేసి... వీలైనంత త్వరితంగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
జీహెచ్ ఎంసీ హైకోర్టుకు నివేదించిన సమాచారం మేరకు.. డీలిమిటేషన్ నుంచి రిజర్వేషన్ల ఖరారు వరకు 172 రోజులు అవసరం. అనంతరం ఎన్నికలకు మరో 45 రోజులు పడుతుంది. వీటిలో చట్టప్రకారం తప్పనిసరిగా గడువివ్వాల్సిన రోజులు పోను... మిగతా అంశాలను త్వరితంగా పూర్తి చేస్తే... ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహిస్తారనే ది విశ్వసనీయ వర్గాల సమాచారం. డివిజన్లను 150కే పరిమితం చేస్తున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇప్పటికే కసరత్తు పూర్తయినందునముసాయిదాను ప్రజల ముందుకు తెచ్చేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు.
పది రోజుల్లో విభజన ముసాయిదాను ప్రజల ముం దుకు తెచ్చి... అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని కమిషనర్ సోమేశ్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. కొన్ని డివిజన్లలో పెద్దగా మార్పులు అవసరం లేదని... కొన్నిటిలో ఎక్కువ మార్పులకు అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. 2011 లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790. 150 డివిజన్లనే హేతుబద్ధీకరిస్తే ఒక్కో డివిజన్‌కు సగటున (పది శాతం మేరకు వ్యత్యాసం ఉండవచ్చు) 44,879 మంది ఉండాలి. ఈ మేరకు ఇప్పటికే ముసాయిదాలు... డివిజన్ మ్యాపులు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మొదలుపెట్టాం...
ైెహ కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా డీలిమిటేషన్ పని ప్రారంభించామని కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. డివిజన్ల విభజన, పోలింగ్ స్టేషన్ల ఎంపిక పూర్తయ్యాక రిజర్వేషన్ల పనులు ప్రారంభిస్తామన్నారు. తిరిగి 150 డివిజన్‌లే చేయాల్సి వచ్చిన విషయమై హైకోర్టుకు నివేదించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని డివిజన్లలో పెద్దగా మార్పులు అవసరం లేదు. ఉదాహరణకు కోర్ ఏరియాలోని సర్కిల్-7ను పరిగణనలోకి తీసుకుంటే... పరిపాలన సౌలభ్యం దృష్ట్యా దీన్ని7-ఎ, 7-బిగా విభజించారు. ఒకే సర్కిల్‌గా ఉన్నప్పుడు 16 డివిజన్లు ఉండగా... విభజించాక రెండింటిలో కలిసి 16 డివిజన్లే ఉన్నాయి. కాకపోతే ఒక సర్కిల్‌లో 7... మరో సర్కిల్‌లో 9 డివిజన్లు రానున్నాయి. ఈమేరకు ముసాయిదా మ్యాపులు రూపొందించినట్లు తెలిసింది. ఈ సర్కిళ్లలోని డివిజన్లు నిర్ణీత జనాభాకు అనుగుణంగా ఉండటంతో పెద్దగా విభజించాల్సిన పని పడలేదు.
సర్కిల్-7 ఎ, 7బిలోకి దిగువ పేర్కొన్న డివిజన్లు వచ్చే అవకాశం ఉంది.
సర్కిల్ 7 -ఎలోకి రానున్న డివిజన్లు
1.అహ్మద్‌నగర్, 2.ఆసిఫ్‌నగర్, 3.మల్లేపల్లి, 4.మెహదీపట్నం (పాక్షికం), 5.మురాద్‌నగర్, 6. రెడ్‌హిల్స్, 7.విజయనగర్‌కాలనీ.
సర్కిల్ 7-బి లో...
1.దత్తాత్రేయ నగర్, 2.గుడిమల్కాపూర్, 3.కార్వాన్, 4.లంగర్‌హౌస్, 5.మంగళ్‌హాట్, 6.మెహదీపట్నం (పాక్షికం), 7. టోలిచౌకి, 8.జియాగూడ, 9.నానల్‌నగర్.
మెహదీపట్నం రెండు సర్కిళ్లలోనూ
ఉండటం గమనార్హం.
సాధారణంగా విభజన పూర్తయ్యాక వార్డుల వారీగా ఎన్నికల జాబితా తయారీకి 72 రోజులు పడుతుంది. అనంతరం రిజర్వేషన్లకు బీసీ గణన తదితరమైన వాటికి మరో 102 రోజులు అవసరమని అధికారులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఎటొచ్చీ ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. లేనిపక్షంలో కనీసం ఆలోగా ఎన్నికల షెడ్యూలునైనా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్15లోగా ఎన్నికలు పూర్తి చేయలేకపోవడానికి గల కారణాలను కోర్టుకు నివేదిస్తూ, మరికొంత గడువు కోరే అవకాశాలు ఉన్నాయి.