
'హైకోర్టు ఆదేశాల ప్రకారమే గ్రేటర్ ఎన్నికలు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్ ను కుదించాలనుకున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఎక్కువ జనసాంద్రత ఉన్న దృష్ట్యా, ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రజలు అసౌర్యానికి గురయ్యే అవకాశముందన్నారు. అధికారులు ఎక్కువ రోజులు ఎన్నికల విధుల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల గడువును కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు గురువారం కొట్టివేసింది. 15 రోజులకు కుదించాలన్న సర్కార్ నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీలోగా ఎన్నికల ప్ర్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.