సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ డీ లిమిటేషన్‌కు సంబంధించిన ముసాయిదా వచ్చే వారం వెలువ డే అవకాశాలున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈనెల రెండో వారంలో .. బహుశా 9వ తేదీన ముసాయిదా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే, రాబోయే వేసవిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి.హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, ఇంతవరకు డీలిమిటేషన్, డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియలే ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదు నెలల సమయం పట్టనుంది. తాజా అంచనాల మేరకు అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏప్రిల్- మేలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఎన్నికల జాప్యంపై అందిన ఫిర్యాదుపై పలు పర్యాయాలు విచారణ జరిపిన హైకోర్టు అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని ఆదేశించడంతోపాటు డిసెంబర్ 15 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించిన సంగతి విదితమే. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్, ఆధార్ లింకేజీ, తదితర కార్యక్రమాలు ఒకదాని వెనుక రావడంతో ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీలిమిటేషన్‌పై దృష్టిసారించలేదు. ఇందుకు సంబంధించిన ముసాయిదాలు ఆయా సర్కిళ్ల నుంచి ప్రధాన కార్యాలయానికి అంది నాలుగైదు నెలలవుతోంది.వాటిలో మార్పుచేర్పులు అవసరం కావడంతో ఆ మేరకు సర్కిళ్లకు తిప్పిపంపించారు.
తిరిగి అందాక వాటిని మరోమారు పరిశీలించారు. ఇంకా మూడు సర్కిళ్లలో మార్పుచేర్పులు అవసరమని సంబంధిత అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. సర్కిల్ -5,సర్కిల్-7, సర్కిల్-9 లలో స్వల్ప మార్పులు అవసరమని తాజాగా గుర్తించినట్లు తెలిసింది. ఈ పని పూర్తికాగానే ముసాయిదాను ప్రజల ముందుంచాలని కమిషనర్ సోమేశ్‌కుమార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత మేరకు ఈనెల రెండో వారంలోగా దీన్ని ప్రజల ముందుకు తెచ్చి, అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. అందుకుగాను వారం రోజుల గడువివ్వనున్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 150 డివిజన్లు/వార్డులు ఉన్నాయి. ఇవి 200 డివిజన్లకు పెరగనున్నాయి.
త్వరలో డీ లిమిటేషన్
Published Fri, Sep 4 2015 2:05 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement