గుట్టలు గుట్టలుగా చెత్త
కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె
తీవ్రమవుతున్న పారిశుధ్య సమస్య
సిటీబ్యూరో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడ ంతో జీహెచ్‌ఎంసీలో సమ్మె కొనసాగుతుందని వివిధ యూనియన్ల నేతలు స్పష్టం చేశారు. గత సోమవారం నుంచి జీహెచ్‌ఎంసీలోని కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నగరంలో రోడ్లన్నీ చెత్తకుప్పలుగా మారాయి. రోజుకు దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా, మూడు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పేరుకుపోయి పరిస్థితి మరింత తీవ్రమైంది. ముసురుతున్న దోమలు, ఈగలతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీలో గుర్తింపుయూనియన్ జీహెచ్‌ఎంఈయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు గోపాల్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. కార్మికుల కనీస వేతనం రూ. 16,500కు పెంచడంతో పాటు మిగతా డిమాండ్లనూ వెంటనే పరిష్కరించాలన్నారు. పరిస్థితి తీవ్రత గుర్తించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కార్మికసంఘాల నేతలతో చర్చలు జరిపారు. తన పరిధిలో ఉన్న కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. నాలుగో తరగతి ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, రవికిరణ్ పాల్గొన్నారు.
విధుల్లో పాల్గొనండి..
రంజాన్, బోనాల పండుగలు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే విధుల్లో పాల్గొనాల్సిందిగా కమిషనర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సానుకూలంగా ఉన్నారన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
కార్మికుల సమ్మె కొనసాగుతున్నందున వెంటనే ప్రత్యామ్నాయచర్యలు చేపట్టాల్సిందిగా సోమేశ్‌కుమార్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి స్వచ్ఛ యూనిట్ నోడల్ అధికారికి ప్రత్యేకంగా ఒక వాహనం, నలుగురు కార్మికులను ఏర్పాటుచేసి బుధవారం రాత్రి నుంచి రహదారులపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు.