చాటింగ్.. చీటింగ్
ఫేస్‌బుక్‌లో నకిలీ ఫొటోలు పెట్టియువకులకు ఎర
వారి నుంచి అందినకాడికిదండుకొని జల్సాలు
ఇద్దరు యుువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి యువకులను ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్దరు యువతులను హైదరాబాద్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మీరాలం మండి పత్తర్‌గట్టీకి చెందిన యువతి (20), రికాబ్‌గంజ్‌కు చెందిన యువతి (17) స్నేహితులు. గత నెల 8 న వీరిద్దరు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ఇద్దరు అమ్మాయిల అసలు స్వరూపం తెలియడంతో కంగుతిన్నారు. వీరిద్దరూ ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో యువకులతో స్నేహం చేస్తూ వారి నుంచి డబ్బులు దండుకొని డెహ్రాడూన్, ఊటీ, వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల (నకిలీ) ఫొటోలు పోస్ట్ చేసి యువకులతో చాటింగ్ చేయడం, వారి నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకోవడం వీరు అలవాటు చేసుకున్నారు.
అలా వచ్చిన సొమ్ముతో ఇద్దరూ కలసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లి జల్సా చేసేవారు. ఇప్పటి వరకు వీరిద్దరు 17 మందిని ఫేస్‌బుక్ స్నేహం పేరిట మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వీరి చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. న్యాయసలహా తీసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలకు పాల్పడినందుకు చీటింగ్, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు యువతులు మీర్‌చౌక్ పోలీసుల అదుపులో ఉన్నారు.