మన భూమి ఇస్తూ.. 5,500 కోట్ల ఖర్చా? | Giving our land and 5,500 crore will be spent ? | Sakshi
Sakshi News home page

మన భూమి ఇస్తూ.. 5,500 కోట్ల ఖర్చా?

Published Tue, Jul 5 2016 1:48 AM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM

మన భూమి ఇస్తూ.. 5,500 కోట్ల ఖర్చా? - Sakshi

మన భూమి ఇస్తూ.. 5,500 కోట్ల ఖర్చా?

- సింగపూర్ కంపెనీలకు రాయితీలపై ఆర్థిక శాఖ అభ్యంతరం
- అవేవీ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం..
 
 సాక్షి, హైదరాబాద్ : సింగపూర్ కంపెనీలకు భూమి ఇస్తూ మౌలిక సదుపాయాలు మనం కల్పించడమేమిటి? అందుకోసం రూ. 5,500 ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడమేమిటి?.. సింగపూర్ కంపెనీలపై అవ్యాజమైన ప్రేమ కురిపిస్తూ అలవిమాలిన రాయితీల వరాలిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆర్ధిక శాఖ వేసిన ప్రశ్నలివి. అంతేకాదు ఆ నిధుల విడుదల కోసం వచ్చిన ఫైలునూ తిరస్కరించింది. రాజధానిని అభివృద్ధి చేయడానికి సింగపూర్ కంపెనీలు రూ. 300 కోట్లు ఖర్చుపెడుతుంటే రాష్ర్టప్రభుత్వం రూ.5,500 ఖర్చు పెట్టబోతోంది. అంతేకాదు స్విస్‌ఛాలెంజ్ విధానాన్ని ఆమోదించిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుగుణంగా సింగపూర్ కంపెనీలకు అనేక రాయితీలను ఉదారంగా ఇచ్చేశారు. అయితే వాటిపై ఆర్ధికశాఖ గతంలోనే అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కానీ వాటిని చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. సింగపూర్ సంస్థలకు రాయితీలు ఇవ్వడంపై ఆర్థిక శాఖ సూచనలను, అభ్యంతరాలను చంద్రబాబు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ఖజానాకు భారమైన, సింగపూర్ సంస్థలకు లాభదాయకమైన అనేక నిబంధనలపై ఆర్థికశాఖ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అవేమిటంటే...

► సింగపూర్ సంస్థలకు ఇచ్చిన 1,691 ఎకరాల భూమిలో రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ ఆ సంస్థలు పెట్టిన షరతులకు ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటి కల్పనకు రూ.5,500 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా సీఆర్‌డీఏ కోరింది. ఇంత మొత్తంలో నిధులు లేవని ఆర్థిక శాఖ తిరస్కరించింది.  
► రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వ్యయం చేసి రహదారులు, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తే ఇక సింగపూర్ సంస్థలు చేసేదేమిటని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ఈ మౌలిక వసతులను కూడా సింగపూర్ సంస్థలతో రాయితీ అండ్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న నాటి నుంచి 18 నెలల్లో కల్పించాలనే షరతు విధించారు. 18 నెలల కాలంలో రూ. 5,500 కోట్ల రూపాయల వ్యయం చేసి వసతులను కల్పించకపోతే సింగపూర్ సంస్థలకు సీఆర్‌డీఏ పెనాల్టీ చెల్లించాలనే నిబంధనకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించారు.
► సింగపూర్ సంస్థలు అసలు ఎంత మేర పెట్టుబడి పెడతాయో తేల్చాలని, భూమి ధర మినహా సింగపూర్ సంస్థలు పెట్టుబడి పెట్టే మొత్తంలో 20 శాతం కన్నా ఎక్కువ రాయితీలు, సబ్సిడీలు ఇవ్వరాదని ఆర్థిక శాఖ సూచించింది. ఈ సూచనను ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.
► రాష్ట్ర ప్రభుత్వ కొత్త పర్యాటక విధానంలో ఉన్న  20 శాతం నిబంధనను రాజధానికి వర్తింప చేయాలన్న ఆర్థిక శాఖ సూచనను ప్రభుత్వ పెద్దలు బుట్టదాఖలు చేశారు.
► రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థలను తొలగిస్తే చెల్లించే పరిహారంపై అపరాధ వడ్డీ 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలని, ఈ నిబంధన రాష్ట్ర ఖజానాకు హాని చేకూర్చుతుందని ఆర్థిక శాఖ పేర్కొనగా అందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు.
► ఎస్క్రో అకౌంట్ ఏర్పాటు చేయాలని, అనంతరమే స్విస్ చాలెంజ్‌కు కౌంటర్ ప్రతిపాదనలను ఆహ్వానించాలని ఆర్థిక శాఖ చేసిన సూచనను ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. ఎస్క్రో అకౌంట్ తెరిచేందుకు సింగపూర్ సంస్థలు నిరాకరించినప్పటికీ అందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించారు.
► రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో సింగపూర్ సంస్థలు రెవెన్యూ వాటా కింద ఎంత శాతం ఇస్తారో పేర్కొనలేదు. ఆ సంస్థలు రెవెన్యూ వాటా ఎంత ఇస్తాయో తెలియకుండానే గత నెల 24న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించడం గమనార్హం.
 
 రూ. 300 కోట్ల ఖర్చుకు రూ. 27,461 కోట్ల లాభం
 మనం అభివృద్ధి చేయడానికి ఓ కంపెనీకి 10 ఎకరాలు ఇచ్చామనుకోండి. పెట్టుబడి నిష్పత్తి ప్రకారం లాభం వాటాలూ ఉండడం సహజం. మనం రూ.10 కోట్లు, కంపెనీ రూ. 20 కోట్లు ఖర్చు చేస్తే అదే నిష్పత్తిలో అభివృద్ధి చేసిన స్థలాలను అమ్ముకుంటాం. కానీ రాజధాని అభివృద్ధి విషయంలో ఇది  తిరగబడింది. రూ 300 కోట్లు ఖర్చు పెట్టే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ. 27,461 కోట్లు, 1,691 ఎకరాల భూమి ఇచ్చి రూ. 5,500 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టే రాష్ర్టప్రభుత్వానికి దక్కేది రూ. 19,886కోట్లు.రాజధానిని1,691 ఎకరాలలో అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఆ కంపెనీలు ఖర్చు చేసేది కేవలం రూ. 300 కోట్లు.మౌలికసదుపాయాలకు రాష్ర్టప్రభుత్వం చేయబోయే ఖర్చు రూ. 5,500 కోట్లు. అంటే  సింగపూర్ కంపెనీలు పెట్టే ఖర్చు కన్నా ప్రభుత్వం పెట్టేది పది రెట్లు ఎక్కువ. ఆ తర్వాత అక్కడ గజం రూ.లక్ష  పలుకుతుందని  సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఎకరాలో కొంత రహదారులకు, పార్కులకు పోయినా మిగిలే  2,800 గజాల స్థలం రూ. 28 కోట్లు పలుకుతుంది. అంటే 1,691 ఎకరాల విలువ రూ. 47,348 కోట్లు. అభివృద్ధి చేసిన తర్వాత సింగపూర్ కంపెనీలకు ఈ భూమిలో 58శాతం వాటాకుబాబు సర్కార్ ఒప్పుకుంది అలా వాటికి రూ. 27,461.84 కోట్లు, రాష్ర్ట వాటా 42శాతం కాబట్టి దానికి రూ. 19,886.16 కోట్లు అన్నమాట. మనభూమిచ్చి... మనం ఎక్కువ ఖర్చుపెట్టి... సింగపూర్ కంపెనీలకు ఎందుకు లాభం చేకూర్చాలో.. ఆ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చితే ఏ ‘బాబు’కి లాభమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement