తెలంగాణ ప్రతీక.. కనబడదా ఇక..! | Gongallu in Narayankhed region | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రతీక.. కనబడదా ఇక..!

Published Sun, Jan 7 2018 3:56 AM | Last Updated on Sun, Jan 7 2018 3:56 AM

Gongallu in Narayankhed region - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గొంగడి.. తెలంగాణ సాహిత్య, సామాజిక, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. దక్కన్‌ ప్రాంత రక్షణ కవచం.. వందల ఏళ్లుగా తెలంగాణ జనజీవనంలో భాగమైన ఈ గొంగడి ఇప్పుడు మాయమైపోతున్నదా.. చలిలో వెచ్చదనం, మండుటెండలో చల్లదనాన్ని ఇచ్చే గొంగడి కనుమరుగు కానుందా.. ఉలెన్‌ దుప్పట్లు, బ్లాంకెట్లు, ప్రజల అలవాట్లలో మార్పులు గొంగడి ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. నల్లజాతి గొర్రెలతోపాటే గొంగడి కూడా క్రమంగా అంతరించిపోతోంది. అనేక సంవత్సరాలుగా గొంగళ్ల తయారీని నమ్ముకొని బతికిన కుటుంబాలు ఆ వృత్తికి దూరమయ్యాయి. ప్రస్తుతం మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో 20 కుటుంబాలే నేత గొంగళ్లను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఈ కుటుంబాల్లోనూ పెద్దవాళ్లు తప్ప ఈతరం యువతీయువకులు వృత్తికి పూర్తిగా దూరమయ్యారు. కనుమరుగవుతున్న గొంగడిని కాపాడుకొనే లక్ష్యంతో దక్కన్‌ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం, ఆహార సార్వభౌమత్వ సంఘటనలు సంయుక్తంగా గొంగడి పరిరక్షణ ఉద్యమం చేపట్టాయి. శనివారం బేగంపేటలోని ‘దారం’వస్త్ర షోరూమ్‌లో గొంగళ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ప్రత్యేక కథనం..  

నల్ల గొర్రెలు ఎక్కడ..? 
గొర్రెల నుంచి బొచ్చు సేకరించి శుద్ధి చేసి దారంలా రూపొందించి మగ్గంపై నేయడానికి కనీసం 25 రోజులు పడుతుంది. ఒక గొంగడి తయారు చేయడానికి ఏడాది వయసు దాటిన గొర్రెలు కనీసం 25 అవసరమవుతాయి. వాటి నుంచి మాత్రమే 2 అంచుల పొడవున్న గొర్రె బొచ్చు లభిస్తుంది. గొర్రె వయస్సు పెరిగే కొద్దీ వెంట్రుకల పొడవు తగ్గి గొంగళ్ల తయారీకి పనికి రాకుండా పోతుంది. అయితే గత 20 ఏళ్లలో గొంగళ్ల తయారీకి ప్రధాన వనరైన నల్ల గొర్రెల సంఖ్య భారీగా పడిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో లక్షలాది నల్ల గొర్రెలు ఉండగా.. ఇప్పుడు కేవలం 11 జిల్లాల్లో 10 వేలపైచిలుకే ఉన్నాయి. నల్ల గొర్రెల సంఖ్య తగ్గడంతో బొచ్చు సేకరణ సవాలుగా మారింది.  

ఇప్పుడు మెదక్‌లోనే.. 
దక్కన్‌ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం అధ్యయనం ప్రకారం ప్రస్తుతం గొంగళ్ల తయారీ మెదక్‌లో తప్ప మరెక్కడాలేదు. గతంలో నారాయణ్‌ఖేడ్‌ పరిసరాల్లోని ప్రతి ఊళ్లో కనీసం రెండు, మూడు కుటుంబాలు గొంగళ్లను తయారు చేసేవి. సామాజికంగా గొల్ల, కురుమలే కాకుండా అనేక మంది గొంగళ్లను వినియోగించేవారు. దీంతో ఈ వృత్తికి ఆదరణ లభించింది. అయితే నల్ల గొర్రెల సంఖ్య తగ్గడంతో ఒకప్పుడు గొంగళ్లు నేయడమే వృత్తిగా బతికిన వందలాది కుటుంబాలు క్రమంగా ఆ వృత్తి నుంచి దూరమయ్యాయి. ఇప్పుడు నారాయణ్‌ఖేడ్, శివ్వంపేట, బిజిలీపూర్‌ ప్రాంతాల్లో 20 కుటుంబాలే మిగిలాయి.  

గొంగడి అ‘ధర’హో.. 
నల్లటి నేత గొంగడి ఆరోగ్య ప్రదాయిని. ఎన్ని రకాల దుస్తులు, సదుపాయాలు అందుబాటులోఉన్నా కాలానికి తగినట్లు సేవలందించేది ఒక్క గొంగడి మాత్రమే. అందుకే తెలంగాణ జీవితంలో, సంస్కృతిలో, ఆటపాటల్లో భాగమైంది. గోచి, గొంగడి తెలంగాణ కళారూపాలయ్యాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న గొంగడి ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ధరలూ కాస్త ఎక్కువే ఉన్నాయి. హైదరాబాద్‌ బేగంపేటలోని ‘దారం’షోరూమ్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక్కో గొంగడి రూ.6000 నుంచి రూ.9,000 వరకు లభిస్తోంది. ఆదివారం కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు గొంగళ్ల ప్రదర్శన ఉంటుంది. ఒక్కసారి గొంగడి కొంటే 10–20 ఏళ్ల వరకు మన్నికైన సేవలందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. 

ఈ వృత్తి మాతోనే పోయేటట్టున్నది..
‘ఇప్పుడు గొర్రె బొచ్చు దొరుకుతలేదు. కత్తిరించి తెచ్చేవాళ్లూ లేరు. మాతోనే ఈ వృత్తి పోయేటట్టున్నది. మహా అయితే ఇంకో నాలుగైదేండ్లు మాత్రమే పని చేస్తాం కావచ్చు. మా పిల్లలకైతే ఈ పని రానే రాదు.’’
– గుండా యాదమ్మ, గొట్టిముక్కల, శివ్వంపేట మండలం  

నేటి తరానికి పరిచయం అవసరం 
మా ఇంట్లో ఇప్పటికీ గొంగడి వినియోగిస్తాం. ప్రత్యేకంగా నా కోసం ఓ గొంగడి కొనుక్కోవాలనే నాన్నతో కలసి వచ్చా. నేటి తరానికి గొంగడి గొప్పతనాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.
– వర్ష శేష్, సైనిక్‌పురి 

నల్లగొర్రెలు కావాలి 
ఎర్ర గొర్రెలు కాకుండా నల్ల గొర్రెలను ఉత్పత్తి చేసి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అంతరించిపోతున్న గొంగడి తయారీని కాపాడాలి. హైదరాబాద్‌లో ఇప్పటికి ఏడుసార్లు, బెంగళూర్, ఢిల్లీల్లో రెండుసార్లు ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. జనం ఆదరిస్తున్నారు. కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కావలసిందల్లా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం.
– యాదగిరి, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ప్రధాన కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement