శుక్రవారం రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ దంపతులు. చిత్రంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందు ఆహ్లాదంగా సాగింది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు తెలంగాణ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాలేదు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో రాజ్‌భవన్‌లో సందడి నెలకొంది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎంఐఎం నుంచి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విందులో పాల్గొన్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైన విందు.. రాత్రి ఏడు గంటల దాకా కొనసాగింది. గవర్నర్ నరసింహన్ దంపతులు మంత్రులతో పాటు దాదాపు అందరినీ పలకరిస్తూ, పరిచయం చేసుకుంటూ విందులో కలియదిరిగారు. సీఎం కేసీఆర్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉన్నారు. అనంతరం ఆయన కొద్ది సేపు గవర్నర్‌తో భేటీ అయ్యారు.
తేనీటి విందుకు కాంగ్రెస్ దూరం..
కాగా, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తేనీటి విందుకు హాజరు కాలేదు. ఇటీవల గవర్నర్, కాంగ్రెస్ మధ్య జరిగిన వివాదం కారణంగానే వీరు హాజరు కాలేదని ప్రచారం జరిగింది. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరు కాకూడదని పార్టీలో అంతర్గతంగా చర్చించి నిర్ణయించుకున్నారని సమాచారం. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ విందుకు వచ్చారు. పార్టీ నిర్ణయం తనకు తెలియదని, గాంధీభవన్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతోనే హాజరయ్యాయనని, పార్టీ నిర్ణయం తెలిసి ఉంటే హాజరయ్యే వాడిని కాదని ఆనంద్ భాస్కర్ మీడియాకు చెప్పారు.
ఏపీ నుంచీ..
ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాకపోయినా, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తేనీటి విందులో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రులు కె.రోశయ్య, నాదేండ్ల భాస్కర్‌రావు, మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, యలమంచిలి శివాజీ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వర్గమంతా...
తేనీటి విందుకు తెలంగాణ మంత్రివర్గం దాదాపుగా కదిలి వచ్చింది. గణతంత్ర వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కచ్చితంగా హాజరు కావాలని పార్టీ నుంచి సమాచారం ఇచ్చారు. ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేలు తిరిగి జిల్లాలకు వెళ్లిపోగా, మంత్రులు సాయంత్రం జరిగిన విందుకు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూపల్లి కృష్ణారావుతోపాటు మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment