సుహాసిని వేధింపుల వల్లే గురుప్రసాద్ ఆత్మహత్య?
హైదరాబాద్: భార్య సుహాసిని వేధింపుల వల్లే ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గురు ప్రసాద్ తన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి(9), నందవిహారి(5)లను హత్య చేసి, ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ కోడలు సుహాసిని వ్యవహరించిన తీరు వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వారు చెబుతున్నారు.
ఈ ఘటనలో ఎవరో ఒకరి తప్పు మాత్రమే ఉంటుందని చెప్పలేమని పలువురు అంటున్నారు. పూర్తీగా సుహాసిని వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావించలేమని అంటున్నారు. ఇద్దరి తప్పు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇద్దరు పిల్లలను చంపడంలోనే అతని మానసిక పరిస్థితి అర్ధమవుతోందని న్యాయవాది కిరణ్ అన్నారు. విభేదాలు, విడిపోవడం వల్ల తను ఎంత బాధపడ్డాడో, తన భార్య కూడా అదే విధంగా బాధపడాలన్న ఉద్దేశంతోనే అతను పిల్లలను హత్య చేసి ఉంటాడని అన్నారు. 498ఏ చట్టం దుర్వినియోగం అవుతున్నట్లు తెలిపారు. భర్త వల్ల ఇబ్బందులు ఎదురైతో భార్యలు భర్తతోపాటు అత్త,మామ, ఆడబిడ్డ.. ఇలా కుటుంబ సభ్యులు అందరిపైన కేసు పెడుతున్నారని చెప్పారు. ఆ చట్టంలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉందన్నారు.
ఈ రోజు ఉదయం సాక్షి టీవీ చిట్చాట్లో సినిమా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఇటువంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. ఇంతటి దారుణానికి పాల్పడే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు. పిల్లల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరం అన్నారు. కష్టసుఖాలు ఉంటుంటాయని చెప్పారు. ఎవరైనా ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని జయించడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. గురుప్రాసాద్ పిల్లలు చక్కగా, ముద్దుగా ఉన్నారని, వారిని హత్య చేయడం చాలా బాధవేసిందన్నారు. ఎవరూ ఇటువంటి దారుణానికి ఒడికట్టవద్దని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
**