వేలాడే పూదోట | Hanging pudota | Sakshi
Sakshi News home page

వేలాడే పూదోట

Published Mon, Nov 24 2014 12:51 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

వేలాడే పూదోట - Sakshi

వేలాడే పూదోట

అపార్టుమెంట్లు.. ఇరుకిరుకు ఇళ్లు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చందాలకు ఇక చోటెక్కడ! బాల్కనీల్లో కాస్త చోటు దొరుకుతున్నా.. అందులో ఒకటి రెండు కుండీలకు మించి పెట్టలేని పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే  కొకెడమా స్ట్రింగ్ గార్డెన్. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ట్రెండ్ ఇదే. ఉద్యానవన నిపుణులు అభివృద్ధి చేసిన ఈ వేలాడే పూదోటలపై ఓ లుక్కేద్దాం.
 
వేలాడే పూదోటలకి ప్రధానంగా కావల్సింది కొకెడమా. అంటే గడ్డి బంతి. కుండీల అవసరం లేకుండా పెరిగే బంతి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా స్ట్రింగ్ గార్టెన్‌కు సరిపోయే (నీడపట్టున పెరిగే) మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. అలాంటి వాటిలో ఫెర్న్, బెగోనియాలూ, ఆర్కడ్లూ ప్రధానమైనవి. ఇటీవల అందం కోసం పెంచుకునే తేలికపాటి మొక్కలతో ఇంట్లోకి అవసరమయ్యే ఔషధ మొక్కలూ ఇలా పెంచుతున్నారు. తరువాత 7:3 నిష్పత్తిలో పీట్ మాప్ (కుళ్లిన నాచు మొక్కలు), బోన్సాయ్ సాయిల్ తీసుకుని తగినన్ని నీళ్లతో మట్టి మాదిరిగానే జిగురులా అయ్యే వరకు కలపాలి. స్ఫాగ్నమ్ మాస్ (ఎండిన ఒక రకం నాచుమొక్క)ను నీళ్లలో నానబెట్టాలి. ఇది నీళ్లను పీల్చుకుని వేళ్లకు అందిస్తుంటుంది.
 
షీట్ మాస్ (అట్ట మాదిరిగా ఉండే ఒకలాంటి నాచు)

ముందు వేళ్లకు మట్టి లేకుండా చేయాలి. నీళ్లలో ముంచి తీయాలి. వేళ్ల చుట్టూ స్ఫాగ్నమ్ మాస్ ఉంచి.. దారంతో కట్టాలి. క్రమంగా  దారం నాచులో కలిసిపోతుంది. దాన్నుంచి వేళ్లు ఆపైన ఉండే పీట్ మాస్ (అట్ట మాదిరిగా ఉండే ఒకలాంటి నాచు) మిశ్రమంలోకి చొచ్చుకు వస్తాయి. దీనిపైన షీట్ మాస్‌ను గుండ్రంగా చుట్టి దారంతో కట్టాలి. మరో  పొడవాటి దారాన్ని మొక్కకు కట్టి కావాల్సిన చోట వేలాడదీయాలి.
 
 
 నీళ్ల టెన్షన్ లేదు...
 వీటికి రోజూ నీళ్లు పోయాల్సిన పని లేదు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఓ చిన్న బకెట్‌లో నీళ్లుపోసి, అందులో బంతి మునిగేలా ఓ పదినిమిషాలు ఉంచితే చాలు. వేలాడే కుండీల్లోనూ మొక్కల్ని పెంచుకోవచ్చు. కానీ వాటికి రోజూ నీళ్లూపోయాలి. అదే కొకెడామా అయితే ఆ అవసరం లేదు. దీనికి అవసరమైన పదార్థాలన్నీ నర్సరీల్లోనూ దొరుకుతున్నాయి.  
  విజయారెడ్డి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement