
'బార్లలో హ్యాపీ అవర్స్ పెట్టకూడదు'
హైదరాబాద్: అమ్మకాలు పెంచుకునేలా బార్లలో హ్యాపీ అవర్స్ పెట్టకూడదని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. శనివారం శేరిలింగంపల్లిలో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రవదన్ మాట్లాడుతూ.. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమన్న హెచ్చరికతో పాటు మద్యం తాగి వాహనాలు నడపరాదన్న హెచ్చరికను కూడా మద్యం బాటిళ్లపై ముద్రించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్‌లు, బార్లకు వచ్చి మందుతాగి వెళ్లేవారు వాహనాలు నడపకుండా సంబంధిత బార్లు, పబ్ యాజమానులే చర్యలు తీసుకోవాలని సూచించారు.
21 లోపువారికి మద్యం విక్రయించే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ఏటా 5 లక్షల మంది ప్రమాదానికి గురవుతున్నారని కమిషనర్ సందీప్ కుమార్ వెల్లడించారు. ప్రమాదాలకు గురవుతున్న వారిలో 77 శాతం మంది యువకులే ఉన్నారని సందీప్ కుమార్ తెలిపారు.