నదీ జలాల విషయంలో గత పాలకులు ఏడు సంవత్సరాల కాలంలో మహారాష్ట్రతో 7 సార్లు సమావేశాలు నిర్వహిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 10 సార్లు సమావేశాలు నిర్వహించామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
హైదరాబాద్: నదీ జలాల విషయంలో గత పాలకులు ఏడు సంవత్సరాల కాలంలో మహారాష్ట్రతో 7 సార్లు సమావేశాలు నిర్వహిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 10 సార్లు సమావేశాలు నిర్వహించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్పై వివరణ ఇచ్చిన ఆయన.. ప్రభుత్వానికి తెలంగాణ అవసరాలు, భవిష్యత్తు ముఖ్యమని స్పష్టం చేశారు.
ఇంత కరువు కాలంలోనూ ఈ ఏడాది ఇంద్రావతి నుంచి 1400 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయన్న హరీష్ రావు.. ప్రాజెక్టుల ద్వారా ఇలాంటి వృధాను అరికడతామన్నారు. హైదరాబాద్ మంచి నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు రూపొందిస్తున్నామన్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణను ప్రత్యేక ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని హరీష్ కోరారు. పాలేరు, వైరా, లంకసాగర్, సీతారామ ఎత్తిపోతల ప్రాంజెక్టులతో ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయిలో నీరందిస్తామన్నారు.