'వారిని ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయి'
హైదరాబాద్: మల్లన్న సాగర్ నిర్వాసితులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం హైదారాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీడు భూములను రెండు పంటలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. దానికోసం కొద్దిపాటి భూమి తీసుకుని ఎక్కువ రేటు ఇస్తే తప్పా? అని ప్రశ్నించారు. రాజధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 54 వేల ఎకరాలు తీసుకున్నారని.. మరీ అది కరెక్టా? అని సూటిగా ప్రశ్నించారు. గన్నవరం ఎయిర్పోర్టుకు మూడు పంటలు పండే భూమి లాక్కున్నారని విమర్శించారు.
పశ్చిమబెంగాల్లో పారిశ్రామికవేత్త కోసం 14 మంది రైతులను సీపీఎం చంపించందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పులిచింతల కోసం నల్లగొండ జిల్లాలో 28 గ్రామాలను ముంచిన ఘనత కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలదేనని దుయ్యబట్టారు. ప్రజలను మెప్పించి, ఒప్పించి భూమిని సేకరించాలనుకుంటున్నామనీ, అంతే తప్ప బలవంతంగా లాక్కునే ప్రయత్నం తాము చేయమని హరీశ్ స్పష్టం చేశారు.