రోహిత్ తల్లిని ఎంత ఓదార్చినా తక్కువే: వీసీ
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించలేదని హెచ్సీయూ వైస్ ఛాన్సులర్ అప్పారావు తెలిపారు. ఆయన సోమవారం సాక్షి టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ...'రోహిత్ సస్పెన్షన్ పీరియడ్ తగ్గించడానికి చివరి వరకూ ప్రయత్నించాను. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆయన లేఖ కారణంగానే రోహిత్ను సస్పెండ్ చేయలేదు. వర్సిటీలో కుల శక్తులు, అసాంఘిక శక్తులు లేవు.
రోహిత్ తల్లి బాధ ఎంతకు తీరనిది. ఆమెను ఎంత ఓదార్చినా తక్కువే. రోహిత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వర్సిటీలో ఉద్రిక్తత కారణంగా రోహిత్ తల్లిని కలవలేకపోయాను. విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నందువల్లే నా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. నేను వీసీగా రాకముందే... విద్యార్థుల మధ్య గొడవ ఉంది. 14 రోజులపాటు విద్యార్థుల ఆందోళనపై ఇతర ప్రొఫెసర్లతో మాట్లాడుతూనే ఉన్నా' అని తెలిపారు.