నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి: స్మృతి
న్యూఢిల్లీ : పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపించామని, నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయని ఆమె సోమవారమిక్కడ అన్నారు. యూనివర్సిటీల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం హెచ్సీయూలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె తెలిపారు. రోహిత్ కుటుంబసభ్యులకు స్మృతి ఇరానీ ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఇదే ఘటనపై ఢిల్లీలోని స్మృతి ఇరానీ నివాసాన్ని ఇవాళ విద్యార్థులు ముట్టడించారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై సహ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.