రోహిత్ చావుకు ఎవరు బాధ్యులు?
‘చావు లాంఛనాల గురించి రాయడం మర్చిపోయాను. ఎవరూ నా ఆత్మహత్యకు బాధ్యులు కాదు. వారి చర్యల ద్వారాగానీ, మాటల ద్వారాగానీ నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఇది పూర్తిగా నా స్వనిర్ణయం. నా చావుకు నేనే బాధ్యుడిని. నా స్నేహితులనుగానీ, నా శత్రువులగానీ నా ఆత్మహత్య కారణంగా వేధించకూడదు’ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం ఇదీ.
ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడితో గొడవ పడిన ఏబీవీపీ, నాడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్వయంగా లేఖ రాసిన సాక్షాత్తు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పించుకునేందుకు ఈ సూసైడ్ నోట్ రక్షణ కవచంలా ఉపయోగపడొచ్చు. బోల్డంతా భవిష్యత్తుకు తిలోదకాలిచ్చి అర్ధాంతరంగా వెళ్లిపోయిన వేముల ఆత్మహత్యలో దాగున్న వేదన, వాస్తవ పరిస్థితులు మనందరిని వేటాడుతూనే ఉంటాయి. మన పిరికితనం వల్ల వేముల చనిపోయాడు. తోటి అకాడమిక్ విద్యార్థుల పిరికితనం. యూనివర్శిటీ అధికారుల పిరికితనం. రోహిత్, అతడి సహచరులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టాల్సిందిగా వచ్చిన ఆదేశాలకు లొంగిపోయిన పిరికితనం, ఓ బీజేపీ కార్యకర్తను గాయపరిచారనే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని విచారణ కమిటీ నిగ్గు తేల్చినా పట్టించుకోని యూనివర్శిటీ అధికారుల పిరికితనం ఇవన్నీ కారణమే. రోహిత్ తోపాటు మరో నలుగురు అనుచరులను క్యాంపస్ నుంచి తరిమేసిన అధికారుల చర్యా కారణం.
ఆత్మహత్య చేసుకోవాలని విపరీత నిర్ణయానికి రావడానికి దోహదం చేసిన పరిణామాలేమిటో వేముల రోహిత్ తన సూసైడ్ నోట్‌లో వెల్లడించకపోవచ్చు. అలాగే, ముంబై బాంబు పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన యాకూబ్ మెమన్ ను గత ఏడాది ఉరితీయవద్దంటూ తన గ్రూప్ ప్రదర్శన జరపలేదని చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మతహింసపై ‘ముజఫర్ నగర్ బాకీ హై’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదనీ చెప్పలేదు. ఈ చర్యల కారణంగా ఏబీవీపీ విద్యార్థులకు కోపం వచ్చిన విషయాన్ని చెప్పలేదు. వారి ప్రోద్బలంతో ఈ జాతి విద్రోహులపై చర్య తీసుకోమంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి బండారు దత్తాత్రేయ లేఖ రాసిని విషయాన్నీ చెప్పలేదు. గత రెండు వారాలుగా క్యాంపస్ ఆరుబయట నిద్రిస్తున్న విషయాన్నీ రోహిత్ చెప్పలేదు.
దానికి బదులుగా ‘ఈ క్షణంలో నేను బాధ పడటం లేదు. విచారించడమూ లేదు. నా హృదయం ఖాళీ. నా పట్ల నాకు ఆందోళన లేదు. నేనెందుకు ఇలా చేస్తున్నాను’ అని లోలోన బాధపడిన రోహిత్, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడన్న విషయం చెప్పలేదు. కానీ ప్రేమ, బాధ, జీవితం, చావు గురించి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు, ఈ క్షణం తన గుర్తింపు ఏమిటీ అన్న స్థాయికి పడిపోయిన ప్రపంచ విలువల గురించి చెప్పాడు. మనిషి మేథస్సును కాకుండా, ఒక ఓటరుగా, జనాభాలో ఒక అంకెగా, ఓ వస్తువుగా మనిషి మారిపోయిన విషయాన్ని చెప్పాడు. తోటి మనుషులను ఓ మేధస్సు కలిగిన వ్యక్తులుగా చూడాలని చెప్పాడు. నక్షత్ర ధూళి నుంచి చదువులో, వీధుల్లో, జీవితాల్లో, ఆఖరికి చావులోనూ అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని చెప్పాడు. ఓ దళితుడిగా వేముల రోహిత్ చనిపోదల్చుకోలేదు. సైన్స్ రైటర్ కావాలనుకున్నాడు. నక్షత్రాలను తాకాలనుకున్నాడు.
అంబేడ్కర్ విద్యార్థుల సంఘం సభ్యుడిగా జాతీయ స్ఫూర్తికి కట్టుబడ్డాడు. భారతీయ ముస్లింల తరఫున నిలబడ్డాడు. అన్ని వర్గాల నుంచి సంఘీభావాన్ని కూడగట్టాలనుకున్నాడు. అతడితో నడిచేందుకు ప్రపంచం విఫలమైంది. అందుకని రోహిత్ తన తనువు చాలించుకున్నాడు. వేముల రోహిత్ వంటి కలలను నిజం చేయాలని తపన పడేవారికి ఒక్క హైదరాబాద్ యూనివర్శిటీలోనే కాదు, ఏ యూనివర్శిటీలోనూ చోటు ఉండకపోవచ్చు. మనలాంటి పిరికివాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో ఒంటరినని, తానొక ఖాళీ అని వేముల రోహిత్ ఎందుక భావించారు?