జై హనుమాన్...
నగరంలో ఘనంగా హనుమజ్జయంతి
వైభవంగా సాగిన శోభాయాత్ర
అబిడ్స్/కలెక్టరేట్: జై హనుమాన్..జై శ్రీరాం...జై భజరంగబళి నినాదాలతో నగరం హోరెత్తింది. హనుమాన్ జయంతిని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. నగరం నలుమూలలా హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. గౌలిగూడ రాంమందిర్‌లో ముందుగా భజరంగ్‌దళ్ తెలంగాణ అధ్యక్షులు వై.భానుప్రకాష్ హనుమాన్‌జీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రను వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ కార్యదర్శి సురేంద్రకుమార్ జైన్, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు మూసాపేట రామరాజు, కార్యాధ్యక్షులు సురేందర్‌రెడ్డి, భాగ్యనగర్ వీహెచ్‌పీ అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్, బెంగుళూరు క్షేత్ర భజరంగ్‌దళ్ సంయోజకులు సూర్యనారాయణ ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. శోభాయాత్రకు జంట నగరాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీగా తరలివచ్చారు.
జంటనగరాలకు చెందిన హిందీనగర్, వివేకానందనగర్, ఆర్యనగర్, విద్యానగర్, మహంకాళినగర్, అణుశక్తి, విశ్వకర్మనగర్, వాయుపుత్రనగర్ జిల్లాలతో పాటు పాతబస్తీలోని ధూల్‌పేట్, బేగంబజార్, మంగళ్‌హాట్, జియాగూడ, పురానాపూల్, షాలిబండ, చార్మినార్, బహదూర్‌పురా, అత్తాపూర్, జాంబాగ్, గన్‌ఫౌండ్రీ, సుల్తాన్‌బజార్, కోఠి, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గౌలిగూడ రాంమందిర్ ప్రధాన రహదారి నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా మీదుగా సుల్తాన్‌బజార్, కాచిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి నుంచి తాడ్‌బంద్ హనుమాన్ ఆలయానికి తరలివెళ్లింది.
పాల్గొన్న ప్రముఖులు
హనుమాన్ శోభాయాత్రలో భజరంగ్ దళ్ నగర అధ్యక్షులు వీరేశలింగం, మాజీ ఎమ్మెల్యే పి.రామస్వామి, భజరంగ్‌సేన రాష్ట్ర అధ్యక్షులు ఠాకూర్ యమన్‌సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు గోవింద్‌రాఠి, వై. కృష్ణ, గొడుగు శ్రీనివాస్‌యాదవ్, బంగారు సుధీర్‌కుమార్, కార్పొరేటర్ జి. శంకర్‌యాదవ్, బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు గుండెవోని శ్రీనివాస్‌యాదవ్, మీరంపల్లి కృష్ణ, రమేష్‌లతో పాటు టీఆర్‌ఎస్ గన్‌ఫౌండ్రి నాయకులు సంతోష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రకు సెంట్రల్, ఈస్ట్‌జోన్ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. డీసీపీ కమల్‌హాసన్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాధ్, అడిషనల్ డీసీపీ సుంకరి సత్యనారాయణ, ఏసీపీ రావుల గిరిధర్, ఇన్‌స్పెక్టర్‌లు అంజయ్య, శివశంకర్, ఇతర అధికారులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు.