
ఆమె ఆరోగ్యమే మహాభాగ్యం
‘మహిళలు ఆర్యోగ్యమే మహాభాగ్యం. వాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని’ వక్తలు అన్నారు. మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా ఆదివారం నగరంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్లకు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు.
పింకథాన్
నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆదివారం పింకథాన్ నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ రన్‌ను సుప్రసిద్ధ బేర్‌ఫుట్ రన్నర్, పింకథాన్ ఫౌండర్ మిలింద్ సోమన్ ప్రారంభించారు. ఈ రన్‌లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం నాలుగు విభాగాల్లో రన్ నిర్వహించారు. 3కె రన్‌లో ఆకాంక్ష, సాహిత్య, తేజస్వి... 5కె రన్‌లో అనన్య, విద్యా గోల, తేజశ్విణి.. 10కె రన్‌లో మహాదేవి, సోని.. 21కె రన్‌లో వందనా ప్రమోద్, ప్రియాంక, సుప్రియా పటేల్‌లు విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. - ఖైరతాబాద్
వాకథాన్
మహిళల ఆరోగ్యం- ఫిట్‌నెస్ కోసం కాన్ఫడరేషన్ ఆఫ్ ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా(కోవే) ఆధ్వర్యంలో ఆదివారం వాకథాన్
నిర్వహించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ అవగాహన వాక్‌ను ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాయని సునీత, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, రిథమిక్ జిమ్నాస్టిక్ మేఘన, కోవే చైర్‌పర్సన్ గిరిజ పాల్గొన్నారు.
- బంజారాహిల్స్