ఆ ఏజెంట్ల విధులను నిరోధించవద్దు
నంద్యాల పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న వారిని వారి విధులు నిర్వర్తించకుండా నిరోధించరాదని హైకోర్టు మంగళవారం నంద్యాల పోలీసులను ఆదేశించింది. ఒకవేళ వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టప్రకారం మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమపై తప్పుడు కేసులు నమోదు చేయకుండా.. చట్ట విరుద్ధంగా అరెస్ట్‌లు చేయకుండా.. ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా నంద్యాల పోలీసులను ఆదేశించాలని కోరుతూ పోలింగ్ ఏజెంట్లు ఎం.విజయశేఖర్‌రెడ్డి మరో 44 మంది సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు.