దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది?
అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ తీరుపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అసలు దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? ఇప్పటివరకు దర్యాప్తులో ఏం తేలింది? తదితర వివరాలతో తదుపరి విచారణ నాటికి ఓ నివేదికను తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులను ఆదేశించింది. డిపాజిటర్ల విశ్వాసాన్ని పెంచేలా ఆ నివేదిక ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు ఏవైనా బినామీ పేర్లమీద ఉన్నాయా? అన్న విషయాన్ని కూడా తేల్చి ఆ వివరాలను సమర్పించాలంది. అదే విధంగా ఎన్ని ఆస్తులు తనఖా రహితంగా ఉన్నాయి..? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి వివరాలను తమ ముందుంచాలని అగ్రిగోల్డ్ యజమాన్యాన్ని ఆదేశించింది.
తప్పుడు వివరాలు సమర్పిస్తే జైలుకు పంపేందుకు సైతం వెనకాడబోమని అగ్రిగోల్డ్ యజమాన్యానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి, వాటిని చెల్లించకుండా ఎగవేసిందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యా యి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.
‘అక్షయగోల్డ్’పై శ్రద్ధ చూపడం లేదు
అదే విధంగా అక్షయగోల్డ్ కేసులో కూడా విచారణ అదే రోజుకు వాయిదా పడింది. అక్షయగోల్డ్‌కు చెందిన ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదని సీఐడీని ప్రశ్నించిన హైకోర్టు, ఈ కేసు గురించి అస్సలు శ్రద్ధ చూపడం లేదంటూ అక్షింతలు వేసింది.