దర్యాప్తు అధికారితో ఊచలు లెక్కపెట్టిస్తాం.. | High Court fires on CID | Sakshi
Sakshi News home page

దర్యాప్తు అధికారితో ఊచలు లెక్కపెట్టిస్తాం..

Published Sat, Feb 20 2016 2:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

దర్యాప్తు అధికారితో ఊచలు లెక్కపెట్టిస్తాం.. - Sakshi

దర్యాప్తు అధికారితో ఊచలు లెక్కపెట్టిస్తాం..

♦ ‘అగ్రిగోల్డ్’ వ్యవహారంలో సీఐడీపై హైకోర్టు నిప్పులు
♦ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారు
♦ మేం చెప్పినప్పుడే అరెస్ట్ చేసుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదు
♦ అప్పుడే డిపాజిటర్లకు వారి డబ్బు దక్కేది
♦ రూ.పదివేల కోట్ల వివాదంలో బ్యాంకుల్లో ఆరు లక్షలే ఉండటమేంటీ?
♦ సీఐడీకి హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణ 26కు వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అగ్రిగోల్డ్ యజమాన్యానికి కొమ్ముకాస్తూ అన్ని విషయాల్లో వారికి సహకరిస్తున్నారని మండిపడింది. తాము చెప్పినప్పుడే వారిని అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదని వ్యాఖ్యానించింది. కిందికోర్టులో నిందితులకు బెయిల్ వచ్చేందుకు సహకరిస్తే  సీఐడీ అధికారితోఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించింది. అంతేగాక అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.6 లక్షలే ఉన్నట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. రూ.10వేల కోట్ల ఆస్తుల వివాదంలో రూ.6 లక్షలు మాత్రమే ఉండటంలో అర్థమేంటని సీఐడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. బ్యాంకు ఖాతాల్లో నిధులన్నీ ఎక్కడకు వెళ్లాయని నిలదీసింది.  తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ వేర్వేరుగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది.

 బిడ్డర్లకు భరోసా ఇవ్వండి...
 ఈ సందర్భంగా హైకోర్టు ఏర్పాటుచేసిన వేలం పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కమిటీ తాజాగా సమావేశం జరిపిందంటూ నివేదికను సమర్పించారు. అగ్రిగోల్డ్ భూముల వేలంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఏ ఒక్క బిడ్డర్ ముందుకు రాలేదని, అందువల్ల ధరను పునఃసమీక్షించి మరోసారి బిడ్‌లను ఆహ్వానిస్తామన్నారు. ఆస్తులు సరైన స్థితిలో లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం, ప్రచారం పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడం, ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం, కొనుగోలుదారుల్ని గుర్తించకపోవడం, వెబ్‌సైట్‌కు ప్రజాదరణ లేకపోవడం బిడ్డర్లు ముందుకు రాకపోవడానికి కారణమని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆస్తులన్నీ వివాదరహితమైనవన్న విషయాన్ని కొనుగోలుదారుల దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టు ఆదేశాలమేరకే వేలం వేస్తున్నట్లు, వేలం ప్రక్రియ ముగిసి సొమ్ము చెల్లించగానే వారికి యాజమాన్యపు హక్కులు సంక్రమిస్తాయని, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రావని చెప్పాలని, ఇదేవిషయాన్ని వెబ్‌సైట్ మొదటిపేజీలో ప్రముఖంగా కనిపించేలా పెట్టాలని సూచించింది.

 కస్టోడియల్ విచారణలు అవసరం లేదన్నారు..
 అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలకు ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయని, వాటిలో ఎన్నింటిని స్తంభింపచేశారని, అందులో ఎంతమేరకు నిధులున్నాయని సీఐడీ తరఫు న్యాయవాది కృష్ణప్రకాశ్‌ను ప్రశ్నించింది. 22 ఖాతాలున్నాయని, అందులో రూ.6లక్షల వరకు నిధులుండొచ్చునని ఆయన జవాబిచ్చారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘మేం చెప్పినప్పుడే అరెస్ట్ చేసుంటే ఈపాటికి డిపాజిటర్లకు వారి డబ్బు అందేది. కేసు నమోదు చేసిన ఏడాది తరువాత కూడా మీరు వారిని అరెస్ట్ చేయలేదు. మీరు వారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. వారికి కొమ్ముకాస్తున్నారు. అగ్రిగోల్డ్ యజమానుల కస్టోడియల్ విచారణ అవసరమే లేదని మీరు ఇదే కోర్టులో చెప్పారు. ఆస్తుల జప్తునకు ముందు ఏమేరకు నిధులు మళ్లించారు.. అవెక్కడకు వెళ్లాయి.. ఈ విషయాలన్నీ వెలికితీయాల్సింది మీరే. రూ.పదివేల కోట్ల ఆస్తుల వివాదంలో బ్యాంకుఖాతాల్లో ఆరు లక్షలే ఉన్నాయంటే దాని అర్థమేంటి.? దీనినెలా సమర్థించుకుటారు. మీ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. మీరు సకాలంలో అరెస్ట్ చేసుంటే ఇదంతా జరిగేది కాదు’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
 
 రూ.25 లక్షలు డిపాజిట్ చేయండి...
 ఇదిలా ఉండగా వేలం పర్యవేక్షణ కమిటీకయ్యే రోజువారీ వ్యయాలు, జీతభత్యాలకోసం రూ.25 లక్షలు డిపాజిట్ చేయాలని, కమిటీ ఖాతాలోనే ఈ మొత్తాన్ని వచ్చే శుక్రవారానికల్లా జమ చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది అంగీకరించారు. ‘ఇప్పటికే మీకు అనేక అవకాశాలిచ్చాం. ఇది మీకిస్తున్న చివరి అవకాశం. రూ.25 లక్షలు డిపాజిట్ చేయకుంటే ఏం చేయాలో మాకు తెలుసు. మీ ఆస్తి ఒక్కటి అమ్మితే రూ.30, 40 లక్షలు వస్తాయి. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని ధర్మాసనం హెచ్చరించింది.
 
 నిందితులకు బెయిల్ రానివ్వొద్దు...
 అగ్రిగోల్డ్ నిందితుల బెయిల్ వ్యవహారంలో సంబంధిత కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తగిన ఆదేశాలిచ్చేలా సీఐడీకి మార్గనిర్దేశం చేయాలని కృష్ణప్రకాశ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తున్న విషయాన్ని పీపీలద్వారా సంబంధిత కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టంచేసింది. నిందితులకు బెయిలిచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి, బెయిలొచ్చేందుకు సహకరిస్తే ఊరుకునేది లేదని, దర్యాప్తు అధికారిని ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement