హైదరాబాద్: 'ఔట్‌లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు మంజూరు చేయడంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును మరోసారి గడువు కోరింది. కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని, మరోసారి గడువు కోరకుండా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువునిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారంలో ఇలా ప్రజాధనాన్ని ఆమెకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలంటూ ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన రచయిత, సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్, కె.ఈశ్వరరావు, ఔట్‌లుక్ మ్యాగజైన్ యాజమాన్యం వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఇప్పటికే ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలుకు మరికొంత గడువునివ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని, మరోసారి గడువు కోరకుండా చెప్పిన విధంగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువునిచ్చింది. ఈ సమయంలో పిటిషనర్ ఈశ్వరరావు తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి స్పందిస్తూ, స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం తిరస్కరిస్తూ, ఎప్పుడు అవసరం అనిపిస్తుందో అప్పుడు తప్పక నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
కౌంటర్ దాఖలుకు టీ సర్కార్‌కు మరింత గడువు
Published Tue, Oct 27 2015 8:17 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
Advertisement