outlook magazine
-
కౌంటర్ దాఖలుకు టీ సర్కార్‌కు మరింత గడువు
హైదరాబాద్: 'ఔట్లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు మంజూరు చేయడంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును మరోసారి గడువు కోరింది. కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని, మరోసారి గడువు కోరకుండా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువునిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారంలో ఇలా ప్రజాధనాన్ని ఆమెకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలంటూ ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన రచయిత, సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్, కె.ఈశ్వరరావు, ఔట్లుక్ మ్యాగజైన్ యాజమాన్యం వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలుకు మరికొంత గడువునివ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని, మరోసారి గడువు కోరకుండా చెప్పిన విధంగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువునిచ్చింది. ఈ సమయంలో పిటిషనర్ ఈశ్వరరావు తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి స్పందిస్తూ, స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం తిరస్కరిస్తూ, ఎప్పుడు అవసరం అనిపిస్తుందో అప్పుడు తప్పక నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. -
స్మితా సభర్వాల్‌కు నిధుల విడుదలపై కోర్టులో పిటిషన్
హైదరాబాద్: 'ఔట్లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు దాఖలు చేశారు. ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డెరైక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్ జనరల్, స్మితాసబర్వాల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. స్మితా సబర్వాల్ ఓ హోటలో పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం గురించి సదరు పత్రిక కథనం, కార్టూన్ ప్రచురించిందని, ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమని, దీని వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినలేదని పిటిషనర్ తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు. -
స్మితా సబర్వాల్ కు అండగా నిలిచిన టీసర్కార్
హైదరాబాద్ : ఔట్ లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారణి, సీఎంఓలో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. ఈ కేసు విషయమై ఆమెకు కోర్టు ఖర్చుల కింద రూ.15 లక్షలను ఇస్తున్నట్లు టీఎస్ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగజైన్ ఆమె గురించి అభ్యంతరకరంగా కార్టూన్ ప్రచురించినప్పటి నుంచి ఆ మ్యాగజైన్ పై సబర్వాల్ న్యాయ పోరాటం కొనసాగిస్తున్న విషయం విదితమే. ఔట్ లుక్ మ్యాగజైన్ కొన్ని రోజుల కిందట 'నో బోరింగ్ బాబు' అనే శీర్షికతో ఓ కామెంట్ ప్రచురించింది. 'ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగే సమావేశాలకు అద్భుత వస్త్రధారణతో హాజరయ్యే ఓ బ్యూరోక్రాట్.. 'కంటికి ఇంపైన మహిళా అధికారి'గా అందరూ కితాబిస్తుంటారని చెబుతూ.. జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఓ అధికారిణి ర్యాంప్‌పై నడుస్తుంటే.. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెనే చూస్తోన్న అభ్యంతరకర కార్టూన్ ను ప్రచురించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఈ విషయంపై సబర్వాల్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తన న్యాయవాది ద్వారా ఆ మేగజైన్ కు నోటీసులు పంపి.. క్షమాపణలు చెప్పాలని గతంలోనే డిమాండ్ చేశారు. -
‘ఔట్లుక్’ కార్టూన్‌పై నిరసన
ఇందిరాపార్కు వద్ద తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆందోళన హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై అసభ్యకరంగా కార్టూన్ వేసి, కథనాన్ని ప్రచురించిన ఔట్లుక్ మ్యాగజైన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్, గ్రూప్ వన్ ఆఫీసర్స్, సివిల్స్ అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. నోటికి మాస్కులు ధరించి, ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ఔట్లుక్ చర్యపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ అధికారి సాధు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ స్మితా సబర్వాల్‌పై ఔవుట్లుక్ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా ప్రధానమంత్రి నుంచి అవార్డును అందుకున్న ఉత్తమ అధికారిణి స్మితా సబర్వాల్ అని కొనియాడారు. ప్రతికా స్వేచ్ఛ పేరిట వ్యక్తుల స్వేచ్ఛను హరించడం సరికాదని, ఇది ఎల్లో జర్నలిజం అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ (ఐపీఎస్), బలరాం, శైలజ (ఐఆర్ఎస్), రమణారెడ్డి (ఐఆర్పీస్), ఉదయనాథ్ (ఐఆర్ఎఎస్), రాహుల్ గౌలీకార్ (ఐఐఎస్), బాలలత (డిఫెన్స్), రవికుమార్ (డిఇఓ), నాగమునయ్య (ఎస్ఓ, అసెంబ్లీ), నరసింహన్ (ఎఎస్‌ఓ, సెక్రటేరియట్) లతో పాటు సివిల్స్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఇంతకు దిగజారతారా?: స్మితా సబర్వాల్
హైదరాబాద్: ఇంగ్లీష్ మ్యాగజైన్ ఔట్ లుక్ లో వచ్చిన అసభ్య కథనంపై న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చెప్పారు. కోర్టు దావాకు గల కారణాలను బుధవారం ఓ జాతీయ ఛానెల్ కు వివరించారు. ఉన్నతమైన సివిల్ సర్వీసెస్‌లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న తనపైనే ఎల్లో జర్నలిజం ఈ స్థాయిలో వేధింపులకు పాల్పడుతుంటే సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చని, ఇది కేవలం తనను మాత్రమేకాక యావత్ మహిళాలోకాన్ని అవమానపరిచిందని ఆమె అన్నారు. సదరు పత్రిక ప్రచురించిన అసభ్య కార్టూన్ పూర్వాపరాలను వివరిస్తూ 'నా పుట్టినరోజు నాడు నా భర్తతో కలిసి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు నేను వేసుకున్న దుస్తుల్ని సూచిస్తూ వాళ్లు (ఔట్లుక్) ఇలా జుగుస్సాకరంగా వ్యవహరిస్తారనుకోలేదు' అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాది ఔట్ లుక్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిందని, దీనిపై ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని సీఎంఓలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న స్మిత స్పష్టం చేశారు. ఇదీ అసలు వివాదం ఔట్ లుక్ మ్యాగజైన్ తన తాజా సంచికలో 'నో బోరింగ్ బాబు' అనే శీర్షికతో ఓ కామెంట్ ప్రచురించింది. 'ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగే అన్ని సమావేశాలకు అద్భుతమైన వస్త్రధారణతో హాజరయ్యే ఓ బ్యూరోక్రాట్.. 'కంటికి ఇంపైన మహిళా అధికారి' గా అందరూ కితాబిస్తుంటారు' అని వ్యాఖ్యానించింది. దానికితోడు జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఓ అధికారిణి ర్యాంప్ పై నడుస్తుంటే.. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెనే చూస్తోన్న అభ్యంతరకర కార్టూన్ ను ప్రచురించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన స్మితా సబర్వాల్ ఔట్ లుక్ పై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. అదే పత్రికలో అంతే నిడివితో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా మ్యాగజైన్ కు నోటీసులు పంపారు. పలువురు మహిళా జర్నలిస్టులు సైతం ఆమెకు అండగా ఉంటామని ప్రకటించారు. -
'ఔట్లుక్ మ్యాగజైన్ పై క్రిమినల్ కేసు'
ఔట్లుక్ మ్యాగజైన్‌పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా సబర్వాల్ కూడా ఔట్లుక్ మ్యాగజైన్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఔట్లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, హైదరాబాద్‌లోని అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాలకు స్మితా సభర్వాల్ తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ సీఎంవో కార్యాలయంలో అడిషనల్ కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి సమర్థురాలైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిపై ఔట్లుక్ పత్రికలో వచ్చిన కథనాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. అదొక నీచమైన కథనమని, ఔట్లుక్ పత్రిక ఒక మహిళా ఐఏఎస్‌ను కించపరిచిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. ఈ కథనం తెలంగాణ ప్రజలను, సీఎంవో కార్యాలయాన్ని అవమానించినట్లుగా ఉందని.. వెంటనే ఔట్లుక్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.