ఇంతకు దిగజారతారా?: స్మితా సబర్వాల్
హైదరాబాద్: ఇంగ్లీష్ మ్యాగజైన్ ఔట్ లుక్ లో వచ్చిన అసభ్య కథనంపై న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చెప్పారు. కోర్టు దావాకు గల కారణాలను బుధవారం ఓ జాతీయ ఛానెల్ కు వివరించారు. ఉన్నతమైన సివిల్ సర్వీసెస్లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న తనపైనే ఎల్లో జర్నలిజం ఈ స్థాయిలో వేధింపులకు పాల్పడుతుంటే సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చని, ఇది కేవలం తనను మాత్రమేకాక యావత్ మహిళాలోకాన్ని అవమానపరిచిందని ఆమె అన్నారు.
సదరు పత్రిక ప్రచురించిన అసభ్య కార్టూన్ పూర్వాపరాలను వివరిస్తూ 'నా పుట్టినరోజు నాడు నా భర్తతో కలిసి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు నేను వేసుకున్న దుస్తుల్ని సూచిస్తూ వాళ్లు (ఔట్లుక్) ఇలా జుగుస్సాకరంగా వ్యవహరిస్తారనుకోలేదు' అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాది ఔట్ లుక్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిందని, దీనిపై ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని సీఎంఓలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న స్మిత స్పష్టం చేశారు.
ఇదీ అసలు వివాదం
ఔట్ లుక్ మ్యాగజైన్ తన తాజా సంచికలో 'నో బోరింగ్ బాబు' అనే శీర్షికతో ఓ కామెంట్ ప్రచురించింది. 'ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగే అన్ని సమావేశాలకు అద్భుతమైన వస్త్రధారణతో హాజరయ్యే ఓ బ్యూరోక్రాట్.. 'కంటికి ఇంపైన మహిళా అధికారి' గా అందరూ కితాబిస్తుంటారు' అని వ్యాఖ్యానించింది. దానికితోడు జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఓ అధికారిణి ర్యాంప్ పై నడుస్తుంటే.. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెనే చూస్తోన్న అభ్యంతరకర కార్టూన్ ను ప్రచురించింది.
దీనిని తీవ్రంగా పరిగణించిన స్మితా సబర్వాల్ ఔట్ లుక్ పై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. అదే పత్రికలో అంతే నిడివితో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా మ్యాగజైన్ కు నోటీసులు పంపారు. పలువురు మహిళా జర్నలిస్టులు సైతం ఆమెకు అండగా ఉంటామని ప్రకటించారు.