
‘మండే’మంటలు
రాష్ట్రంలో 15 చోట్ల 44 డి గ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు
చిన్నచింతకుంటలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత
పెరుగుతున్న వడదెబ్బ మృతులు..
ఇప్పటికే 150కి చేరిన సంఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరుగుతోంది. ఏప్రిల్‌లోనే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో సాధారణం కంటే ఐదారు డిగ్రీలకుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటిందంటేనే బయటికి రావడానికి జంకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం వడ్డెమానులో 45.05 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. అలాగే రాష్ట్రంలో 15 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దీంతో వడగాల్పులు తీవ్రంగా వీస్తుండడంతో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 150 మంది వరకు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు వడదెబ్బ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇదిలావుంటే వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలం అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే...
వరంగల్ జిల్లా మేడారంలో 44.16 డిగ్రీల ఉష్ణోగ్రత, పరకాలలో 44.53 డిగ్రీలు, దుగ్గొండలో 44.87, కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో 44.02, మహదేవపూర్‌లో 44.82, తిరుమలపూర్‌లో 44.31, ముస్తాబాద్‌లో 44.28, కొత్తఘాట్‌లో 44.76, ఖమ్మం జిల్లా ఏడూళ్లబయ్యారంలో 44.82, సీతారాంపట్నంలో 44.87, గార్లలో 44.67, నల్లగొండ జిల్లా మోత్కూర్ లో 44.87 అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లోని మల్కాపూర్‌లో 42.96, చిలకలగూడలో 41.04, తిర్మలగిరిలో 41.51 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 95 శాతం ప్రాంతంలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు రికార్డు అవడం గమనార్హం. దీంతో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావడానికి జనం హడలిపోతున్నారు.