
హోంగార్డుల ఆకస్మిక ఆందోళన
హోంగార్డులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆకస్మిక ఆందోళనకు దిగారు. ఆల్ ఇం డియా హోంగార్డ్స్ సంక్షేమ
► సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
► సంక్షేమ సంఘం చైర్మన్ దీక్ష
హైదరాబాద్: హోంగార్డులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆకస్మిక ఆందోళనకు దిగారు. ఆల్ ఇం డియా హోంగార్డ్స్ సంక్షేమ సంఘం తెలంగాణ చైర్మన్ సకినాల నారాయణ.. ఆదివారం ఉదయం హైదరాబాద్ అంబర్‌పేటలోని సంఘం కార్యాలయం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. ఆయన దీక్షకు హోంగార్డులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. దీక్ష వద్దకు చేరుకున్న హోంగార్డులు సమస్యను వివరిస్తూ గవర్నర్‌కు పోస్టుకార్డులు రాసి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆం దోళన నిర్వహించారు.
ఇటీవల పుష్కరాల సమయం లో ఛత్రినాక పోలీసుస్టేషన్‌లో పనిచేసే హోంగార్డు ఇబ్రహీంపాషా కనిపించకుండా పోరుునా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆందోళనకారులకు పోలీసులు సూచించినా.. వారు దీక్షలు, ఆందోళనను విరమించలేదు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా చెబితేనే దీక్ష విరమిస్తానని నారాయణ స్పష్టం చేశారు. రాత్రి వరకు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా హోంగార్డుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కాగా, 2003లోపు హోం గార్డుగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని, 2004 నుంచి హోంగార్డుగా పని చేస్తున్న వారికి కానిస్టేబుల్ బేసిక్ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు.