మరణ మృదంగం!
నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
నిలోఫర్‌లో రోజుకు సగటున 13 మంది శిశువుల మృతి
కోర్టులు చీవాట్లు పెట్టినా మారని వైద్యసేవల తీరు
పసికూనల బోసినవ్వులు విరబూయాల్సిన చోట మరణ మృదంగం మోగుతోంది... పురిటి నొప్పుల బాధను ఇంకా పూర్తిగా మరిచి పోని ఆ తల్లులకు తీరని వ్యధే మిగులుతోంది... మౌలిక వసతుల లేమి, మందుల కొరతకు తోడు సకాలంలో వైద్యం అందక ప్రతిష్టాత్మాక నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు సగటున 13 మంది శిశువులు మృతి చెందుతుండటం అందరినీ కలిచివేస్తోంది.
నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో జరుగనుంది. సమావేశంపై ఆస్పత్రికి సంబంధించిన సీనియర్ ప్రొఫెసర్లు కానీ, ఇతర అధికారులకు సమాచారం లేదు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఆస్ప త్రిలో కాకుండా సచివాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
సిటీబ్యూరో : అమ్మ కలలు కల్లలవుతున్నాయి. తొమ్మిది నెలలు కడుపులో మోసి పండంటి బిడ్డను కనేందుకు నిలోఫర్ ప్రభుత్వ నవజాతా శిశువుల దవఖానుకు వచ్చే తల్లులకు గుండె కోతే మిగులుతోంది. పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ మత్యుముఖంలోంచి బయటకొచ్చిన తల్లిని మృత శిశువు వెక్కిరిస్తోంది. మరోవైపు ప్రసూతి విభాగంలో క్రిటికల్‌కేర్ యూనిట్ లేక పోవడంతో అధిక రక్తస్రావం వ ల్ల బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉంటే... నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను వెచ్చదనం కోసం వార్మర్లలో పెట్టాల్సి ఉంది. ఆస్పత్రిలో సుమారు వంద వార్మర్లు ఉన్నా...వీటిలో 40కిపైగా పని చేయడం లేదు. ఇది తెలిసి కూడా శిశువులను వాటిపైనే ఉంచడం వల్ల చలికి గజగజ వణుకుతున్నారు. త్వరగా కోలుకుంటారని భావించిన తల్లిదండ్రులకు చివరకు తీరని ఆవేదనే మిగులుతోంది. చాలా మందికి పుట్టుకతోనే కామెర్లు వస్తాయి. శిశువులను ఫొటో థెరిపీ యూనిట్లుపై ఉంచి చికిత్స అందించాల్సి ఉంది. అయితే చూసేందుకు ఫొటోథెరపీ యూనిట్లు పనిచేస్తున్నట్లే కన్పించినా వ్యాధిని నయం చేయలేక పోతున్నాయి. వాస్తవానికి ప్రతి వంద రోజులకు ఒకసారి లైట్లను మార్చాల్సి ఉన్నా..అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు.
అభివృద్ధి కమిటీ అనుమతి ఇచ్చినా...
మూడు అంతస్తులు ఉన్న ఎమర్జెన్సీ విభాగంలో మూడేళ్లుగా లిఫ్ట్ పనిచేయడం లేదు. బాలింతలు తమ చంటిపిల్లలను ఎత్తుకుని అతి కష్టం మీద పై అంతస్తులకు చేరుకోవాల్సి వస్తోంది. కుట్లు పడినలేత శరీరంతో మెట్లు ఎక్కలేక బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు. చేతుల్లో శిశువును పెట్టుకుని మెట్లపై నడుచుకుంటూ పైకి ఎక్కుతుండటం వల్ల మెడలోని నరాలు తెగి శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఎమర్జెన్సీ విభాగంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో 15-20 శాతం మరణాలకు ఇదే కారణమని నిపుణులంటున్నారు. లిఫ్ట్ మరమ్మతుకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అనుమతి ఇచ్చినా ఆర్ ఎంఓ పట్టించుకోవడం లేదు.
పిల్లలే కాదు
తల్లులది అదే దుస్థితి..
ఆస్పత్రిలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్య తలెత్తుతోంది. అత్యవసర పరిస్థితుల్లో వీరికి రక్తం ఎక్కించేందుకు అవసరమైన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ కూడా లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంలో బాలింతలు మృత్యువాత పడుతున్నారు. కేవలం రెండు మాసాల్లోనే 8 మంది బాలింతలు మృత్యువాత పడినట్లు విశ్వసనీ సమాచారం.
చిన్ని గుండెలు బీటలు...
పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది శిశువుల్లో పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. రోగ నిర్థారణకు ఉపయోగించే ఈసీజీ, 2డిఎకో యంత్రాలు ఆస్పత్రిలో లేవు. ఇక ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఉన్నా... లేనట్లే. ప్రతి రోజూ 20-30 మంది శిశువులను నిలోఫన్ వాహనంలో ఉస్మానియాకు తరలిస్తున్నారు. తీరా ఈసీజీ వద్దకు చేరుకునే సమయానికి అప్పటికే అక్కడ భారీ క్యూ ఉంటోంది.
మెరుగైన వైద్యం అందాలంటే..
దేశంలోనే అతిపెద్ధ నవజాత శిశువుల రెఫరల్ సెంటర్‌గా గుర్తింపు పొందిన నిలోఫర్ ఆస్పత్రిలో 550 పడకలు ఉండగా, నిత్యం వెయ్యి మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. 450 పడకల సామర్థ్యంతో కొత్తగా నిర్మించిన రాజీవ్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌ను ప్రారంభిస్తే పడకల సమస్య కొంత వరకు తీరుతుంది.
ఆస్పత్రిలో ప్రస్తుతం 75 మంది వైద్యులుండగా, మరో 75 మంది అవసరం. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు అవసరం కాగా... 130 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో రోగుల బంధువులే సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నారు.
ఆస్పత్రిలో 51 వెంటిలేటర్లు ఉండగా, వీటిలో 11 పని చేయడం లేదు. రోగుల అవసరాలు తీరాలంటే మరో 25 వెంటిలేటర్లు, వ ంద వార్మర్లు, 5 ఫోర్టబుల్ ఎక్సరే మిషన్లు, 4 ఆల్ట్రాసౌండ్ మిషన్లు, ఒక టు డి ఎకో మిషన్, రక్తనాళాల్లో లోపాన్ని గుర్తించే ఒక ఈఎంఎన్‌జీ మిషన్‌తో పాటు 25 ఇంకుబేటర్లు, 60 ఫొటోథెరపీ యూనిట్లు, 50 ఇన్‌ఫ్లూజన్ పంప్స్ 20 ఎన్‌ఐబీ మానిటర్స్, 20 పల్స్ ఆక్సో మీటర్స్, 40 గ్లకోమీటర్లు అవసరం.
శిశు మరణాల రేటు తగ్గించేందుకు శ్రమిస్తున్నాం
ఆపదలో వచ్చిన ప్రతి శిశువును ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నాం. ఇక్కడికి వస్తున్న కేసుల్లో నూటికి 80 శాతం బ్యాక్ కండిషన్ బేబీలే. వారిని కాపాడేందుకు మా వైద్య బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఆస్పత్రిలో వైద్యులకు కొరత లేదు.. కానీ నర్సింగ్ స్టాఫ్, పారమెడికల్ స్టాఫ్, వార్డు బోయ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశాం. మా ఇబ్బందులను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్‌లో నిలోఫర్‌కు రూ.30 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వైద్య పరికరాలు, రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ దేవరాజ్, సూపరింటెండెంట్ , నిలోఫర్