బహిరంగవేలం లేకుండా అద్దె ఎలా..?
హెచ్‌ఎండీఏ తీరును
తప్పుపట్టిన హైకోర్టు...
పీపుల్స్ ప్లాజాను రోజువారీ
అద్దెకు ఇవ్వడంపై అభ్యంతరం
అద్దె ఉత్తర్వులు నిలిపివేత
హైదరాబాద్: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాను ఎగ్జిబిషన్ నిర్వహణకు కేటాయింపు విషయంలో హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ స్థలానికి బహిరంగ వేలం నిర్వహించకుండా రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహా ఉత్సవ్ పేరుతో ఈ నెల 7 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న ఎగ్జిబిషన్ కోసం పీపుల్స్ ప్లాజాను రోజువారీ అద్దె ప్రాతిపదికన ఈవెంట్ మేనేజర్‌కు కేటాయిస్తూ హెచ్‌ఎండీఏ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
అత్యధిక మొత్తానికి బిడ్లు వేసిన వారికే పీపుల్స్ ప్లాజాను కేటాయించాలని, అవసరమైతే ఇందుకు సంబంధించి తిరిగి దరఖాస్తులను ఆహ్వానించాలని హెచ్‌ఎండీఏ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి రెండు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తన దరఖాస్తును కాదని పీపుల్స్‌ప్లాజాను మహా ఉత్సవ్‌కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ చేనేత చేతివృత్తుల ప్రదర్శన నిర్వహణదారు ఎల్.భరత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. తాను రోజుకు రూ.లక్ష చెల్లిస్తానని, పీపుల్స్‌ప్లాజాను తనకు కేటాయించాలంటూ చేసుకున్న దరఖాస్తును పట్టించుకోకుండా, రోజుకు రూ.51 వేలు చెల్లిస్తామన్న మహాఉత్సవ్‌కు కేటాయించారని భరత్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. రూ.51 వేలు చెల్లించేందుకు సిద్ధపడి, అద్దె మొత్తంలో 50 శాతం చెల్లించిన వారికి స్థలం కేటాయించాలని 2007లో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే మహాఉత్సవ్‌కు పీపుల్స్‌ప్లాజాను కేటాయించామని హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బహిరంగ వేలం ద్వారా కాకుండా అద్దె ప్రాతిపదికన కేటాయింపు జరగడం ద్వారా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఎక్కువ ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలను బహిరంగ వేలం ద్వారానే కేటాయించాలని సుప్రీంకోర్టు సైతం పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. రూ.లక్ష ఇచ్చేందుకు పిటిషనర్ సిద్ధమైతే, దేని ఆధారంగా రూ.51వేలు చెల్లిస్తానన్న వ్యక్తికి కేటాయింపు చేశారో అర్థం కాకుండా ఉందని పేర్కొన్నారు.