మన వూరి మెట్రో ఎంతెంత దూరం!
ఆస్తుల సేకరణలో తొలగని చిక్కులు
పరిహారం చెల్లింపులో జాప్యం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పనులకు ఆస్తుల సేకరణ చిక్కులు తొలగడంలేదు. మియాపూర్–ఎల్బీనగర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం కారిడార్లలో ఇప్పటికీ 168 ఆస్తుల సేకరణ ప్రక్రియ జఠి లంగా మారడంతో పనులు మందగమనంలో సాగుతున్నాయి. నూతన భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలి సింది. మరికొన్ని చోట్ల న్యాయ వివాదాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. సోమవారం సచివాలయంలో మెట్రో పనులపై ఏర్పాటుచేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ఆస్తులను తక్ష ణం సేకరించి మెట్రో పనులకు మార్గం సుగమం చేయాలని చీఫ్‌సెక్రటరీ ఎస్పీసింగ్ హెచ్‌ఎంఆర్, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో మున్సి పల్ పరిపాలన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి, హెచ్‌ఎం ఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తదితరులున్నారు.
ఆస్తులు సేకరించాల్సిన ప్రాంతాలు..
► బడీచౌడీ, సుల్తాన్‌బజార్, పుత్లీబౌలిలో 149 ఆస్తులను సేకరించాల్సి ఉంది. ఇందులో 6 ఆస్తులను అడ్డుతొలగించారు. మరో 19 ఆస్తుల సేకరణపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. మిగతా ఆస్తులను సేకరించాల్సి ఉంది.
► దుర్గం చెరువు వద్ద మెట్రో రైలు స్టేషన్ నిర్మాణానికి ఢిల్లీ వాలా స్వీట్స్ సహా మరో 6 ఆస్తులను అడ్డుతొలగించాల్సి ఉంది.
► జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్ మెట్రో రైల్‌స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల వద్ద 8 ఆస్తులను సేకరించాల్సి ఉంది.
► కృష్ణానగర్ వద్ద 5, చిక్కడపల్లి వద్ద 2 యూఎల్‌సీ స్థలాలను సేకరించాల్సి ఉంది.
► బేగంపేట్ మెట్రో రైలు స్టేషన్ నిర్మాణానికి వీలుగా కుందన్‌భాగ్ వద్ద ఆర్‌అండ్ బీకి చెందిన క్వార్టర్ నం.1 ఆస్తిని సేకరించాలి.
పరిహారం చెల్లింపులో జాప్యం..?
ఈ ఏడాది చివరికి నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గాలను మెట్రోపనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ జాప్యంగా మారడానికి బాధితులకు సకాలంలో పరిహారం అందజేయడంలో జాప్యం అవుతున్నట్లు తెలిసింది. సుల్తాన్ బజార్, బడీచౌడీ, కృష్ణానగర్‌లో ఆస్తుల సేకరణ కీలకంగా మారింది. ఆయా ఆస్తులను సేకరించనిదే మెట్రో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మార్గంలోని మెట్రో పనుల్లో ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయినట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి.