ఇలా చేస్తే.. సంతోషం మీవెంటే.. | How to make a happy of life ever | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే.. సంతోషం మీవెంటే..

Published Sat, Apr 16 2016 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

ఇలా చేస్తే.. సంతోషం మీవెంటే..

ఇలా చేస్తే.. సంతోషం మీవెంటే..

సాక్షి, స్కూల్ ఎడిషన్: సంతోషం, కోపం, బాధ, ఆందోళన వంటి అనేక భావనలు మనలో సహజంగా కలుగుతాయి. వీటన్నింటికీ మన మెదడులోని రసాయనాలే కారణం. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిన అంశం. మెదడులో విడుదలయ్యే నాడీ రసాయనాల వల్లే సంతోషం కలుగుతుంది కాబట్టి ఈ రసాయనాలను అదుపులో పెట్టుకుంటే ఎక్కువ ఆనందంగా ఉండొచ్చనేది శాస్త్రవేత్తల మాట. మన చుట్టూ ఉండే పరిస్థితులు, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటివి ఒత్తిడికి గురిచేస్తాయి. ఫలితంగా ఆనందం దూరమవుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో మెదడులో హ్యాప్పీ కెమికల్స్ విడుదలయ్యేలా చూసుకుంటే మళ్లీ సంతోషాన్ని తిరిగి పొందవచ్చు. ఆనందాన్నిచ్చే రసాయనాలు విడుదలయ్యేందుకు ఏం చేయాలో.. దీనివల్ల సంతోషాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం..
 
చల్లని నీటితో..
ఇది రోజూ క్రమం తప్పకుండా చేసేపనే. చల్లని నీరు తీసుకుని కాస్త ముఖంపై చల్లుకోండి. దీనివల్ల గుండె వేగం తగ్గి, వేగస్ అనే ఓ కీలకమైన నాడీ సంబంధిత నరం ఉత్తేజితమవుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. కండరాలు ఎక్కువగా ఆక్సిజన్‌ను వినియోగించుకుంటాయి. వేగస్ ఉత్తేజితమైతే జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. మన మూడ్‌ని, ఆలోచనల్ని మార్చేందుకు పరోక్షంగా ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.
 
సన్నిహితులతో మమేకం..
మూడ్ బాగోలేనప్పుడు ఒంటరిగా, ఒకే ప్లేస్‌లో ఉండడం మంచిది కాదు. వీలైనంత వరకు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నించండి. లేదా ఏదైనా బుక్‌స్టోర్, కాఫీ షాప్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్‌కు వెళ్లండి. అక్కడి వారితో సంభాషించండి. ఇలా ఇతరులతో సరదాగా మాట్లాడడం, ఎంజాయ్ చేయడం వల్ల ఆక్సీటోసిన్ విడుదలవుతుంది. దీంతోపాటు సెరటోనిన్ కూడా మెరుగుపడుతుంది. ఈ రెండు రసాయనాలు ఉత్సాహాన్ని కలిగించేవే. అందువల్ల ఇతరులతో సన్నిహితంగా మెదలడం వల్ల మెదడుకు ఈ రసాయనాల వల్ల కొత్త శక్తి లభిస్తుంది. కేవలం తోటివారితో మాట్లాడడం మాత్రమే కాదు. గార్డెనింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ వినడం వంటి పనులు కూడా చురుకుదనాన్ని కలిగిస్తాయి.
 
 చిరునవ్వు..
సంతోషంగా ఉన్నప్పుడే నవ్వగలుగుతాం అనేది సత్యమే. కానీ నవ్వడం వల్ల కూడా సంతోషం కలుగుతుందనే విషయాన్ని గుర్తించాలి. వీలైనంత వరకు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. చిరునవ్వు అయినా, బిగ్గరగా నవ్వినా సంతోషం కలుగుతుంది. కృత్రిమంగా నవ్వినా, సహజంగా నవ్వినా మెదడులో కలిగే స్పందనలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందువల్ల ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆనందాన్ని కోరుకున్నప్పుడు నవ్వడానికి ప్రయత్నించండి. దీనివల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. దీంతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు.
 
 సూర్యకాంతితో చురుకుదనం..
 వీలున్నంత వరకు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆరుబయట తిరగండి. లేదా ఆఫీస్ వేళల్లో కాస్త సూర్యకాంతి పడేలా చూసుకోండి. అలాగని ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు. సూర్యకాంతి మెదడులో సెరటోనిన్ అనే రసాయనం విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇది మెదడుకు మంచి శక్తినిస్తూ, మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. శరీరంలో మెలటోనిన్ విడుదలయ్యేలా కూడా సూర్యకాంతి తోడ్పడుతుంది. ఇది మంచి నిద్రను అందిస్తుంది.
 
పెంపుడు జంతువులతో కాలక్షేపం..
కుక్క, పిల్లి, కుందేలు, లేదా ఏదైనా పక్షి వంటి పెంపుడు జీవులతో గడపడం వల్ల మొదడుకు కొత్త శక్తి చేకూరి ఆనందం కలుగుతుంది. పెంపుడు జీవులతో కాస్సేపు గడపడం వల్ల మెదడులో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్, డోపమైన్ వంటి హ్యాప్పీ కెమికల్స్ విడుదలవుతాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, ఆరోగ్యపు అలవాట్లు బాగుంటాయని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ముఖ్యంగా శునకాలతో ఆడుకునే వారిలో ఆక్సిటోసిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు జపాన్ అధ్యయనం వెల్లడించింది. అందుకే ఏదైనా పెంపుడు జంతువుకు ఇంట్లో చోటు కల్పించండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement