సీతారాంబాగ్‌లో భారీ అగ్నిప్రమాదం
♦ ఐదంతస్తుల భవనంలో ఎగసిపడిన మంటలు.. కూలిన బిల్డింగ్
♦ రూ. కోటి ప్లాస్టిక్ సామగ్రి బుగ్గి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీతారాంబాగ్ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఉన్న భవనంలో ఉదయం 10.30 గంటలప్పుడు మంటలు చెలరేగాయి. క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించాయి. పోలీసులు ఫైరింజన్లు తెప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ అదుపులోకి రాలేదు. అమర్ అగర్వాల్‌కు చెందిన ఈ ఐదంతస్తుల భవనం మొత్తాన్ని ప్లాస్టిక్ సామగ్రి గోడౌన్‌గా వినియోగిస్తున్నారు. ఇందులోని ప్లాస్టిక్ అగ్నికి బూడిదయ్యింది. దట్టమైన మంటల ధాటికి భవనం కుప్పకూలింది. కలెక్టర్ రాహుల్ బొజ్జా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు రాత్రి వేళ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్ల వారిని ఖాళీ చేయించారు. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. భవనమంతా ప్లాస్టిక్ వస్తువులతో నిండి ఉండటం వల్ల మంటలు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాగా, ఈ వార్త విన్న యజమాని అమర్ అగర్వాల్ గుండె నొప్పితో కుప్పకూలినట్టు ఆయన సంబంధీకులు తెలిపారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనంలో మంటలు అదుపు చేయడానికి అధికారులు అవస్థలు పడాల్సి వస్తోంది.