సత్యనారాయణ మృతదేహం (ఇన్ సెట్) హతుని పాత చిత్రం, నిందితురాలు సోని
కుటుంబ కలహాలతో భర్తను కడతేర్చిన భార్య
బొల్లారం: కుటుంబ కలహాల నేపథ్యంలో సుత్తితో తలపై మోది భర్తను హత్య చేసిందో మహిళ. తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కమేళాలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్ద కమేళా నివాసి సత్యనారాయణ పెయింటర్. ఇతనికి భా ర్య సోనీ, పిల్లలు కీర్తన రాజు(11), నవ్యశ్రీ (8) ఉన్నారు. సోనీ ఇళ్లలో పని చేస్తోంది. భార్యాభర్తలు పలుసార్లు గొడవపడి పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లారు. సత్యనారాయణ గురువారం పనికి వెళ్లొచ్చి రాత్రి ఇంట్లో పడుకున్నాడు.
గొడవల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సోనీ రాత్రి 11 గంటలకు గాఢ నిద్రలో ఉన్న భర్త తలపై సుత్తెతో దాదాపు 18 సార్లు విచక్షణారహితంగా కొట్టింది. తల బద్దలై తీవ్రరక్తస్రావం కావడంలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులకు కట్టుకథ:తర్వాత సోనీ 100 నెంబర్‌కు ఫోన్ చేసి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పింది. వెం టనే తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రాజు, ఎస్‌ఐ శ్రీనునాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భార్యను విచారించగా తాను బాత్‌రూమ్ లో ఉండగా నలుగురు దుండగులు వచ్చి.. తన నోరు మూసి తన భర్తపై సుత్తెతో దాడి చేసి చంపేశారని చెప్పింది.
కుమారుడు కీర్తన రాజుతో కూడా అలాగే చెప్పించింది. అయితే, సోనీ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హతుడి తమ్ముడు మల్లేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.