బంజారాహిల్స్ : భార్యపై అనుమానంతో రోకలిబండతో తలపై బాది అమానుషంగా హత్య చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సయ్యద్ నగర్‌లో నివసించే సయ్యద్ అక్రం(35) నాంపల్లిలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం షాహినాబేగం(30)తో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలున్నారు. షాహినాబేగం శనివారం ఉదయం కూతురిని సమీపంలో ఉండే ప్రియదర్శిని స్కూల్‌లో వదిలేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా అక్రం ఆమెతో గొడవపడ్డాడు. ఆవేశంలో సమీపంలో ఉన్న రోకలిబండతో ఆమె తలపై అందరూ చూస్తుండగానే బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై తలపగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
నిందితుడు అక్కడి నుంచి పరారుకాగా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం కూడా భార్య భర్తల మధ్య తీవ్ర గొడవకాగా ఆమె అలిగి పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు మాట్లాడి నచ్చజెప్పి ఆమెను మళ్లీ భర్త వద్దకు పంపించారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంపట్ల మృతురాలి తల్లిదండ్రులు, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోకలిబండతో బాది భార్యను హతమార్చాడు
Published Sat, Jun 25 2016 6:21 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement