
డ్రగ్స్ కేసు: ముగ్గురు హీరోలు, నిర్మాతలకు నోటీసులు
హైదరాబాద్ : రాజధానిలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారులు బుధవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పదిమందికి నోటీసులు జారీ చేశారు. ఆరోజు రోజుల్లోగా సిట్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్నవారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు, ఓ ఫైట్ మాస్టర్ ఉన్నారు. విచారణకు హాజరు కాకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా సినీ ఇండస్ట్రీతో పాటు ఎంఎన్‌సీ కంపెనీలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
మరోవైపు డ్రగ్స్ రాకెట్లో పలువురు సినీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు స్పందించారు. కొంత మంది డ్రగ్స్ వాడటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.